ఇంటింటికీ నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యం : బండి సంజయ్

by Bhanu |

చొప్పదండి పట్టణ ప్రజలకు ఇంటింటికి నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఇంటింటికీ నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యం : బండి సంజయ్
X

దిశ, చొప్పదండి : చొప్పదండి పట్టణ ప్రజలకు ఇంటింటికి నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తో కలిసి రూ.36.3 కోట్ల వ్యయంతో ‘వాటర్ ఇంప్రూవ్ మెంట్’ స్కీంకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.

అందులో భాగంగా భూమి పూజ చేశారు. శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికీ సరిపడ నీళ్లను అందించాలనే లక్ష్యంతో అమృత్ 2 పథకం కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పైప్ లైన్, వాటర్ సంప్ ఇతర పనులను చేపట్టేందుకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్ 1 పథకం కింద (2015-16 నుండి 2019-20 వరకు) కేంద్ర ప్రభుత్వం తన వాటాకింద ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమ్రుత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్‌లు అందించమన్నారు.

1 కోటి 2 లక్షల మురుగునీటి కనెక్షన్‌లు అందించాం. వీటితోపాటు 2 వేల 411 పార్కులను అభివృద్ధి చేసుకోగాలిగామని తెలిపారు. 62 లక్షల 78 వేల ఎల్ఈడీ లైట్లను మార్చమన్నారు. అలాగే 2021లో అమృత్ 2.0 పథకం ప్రారంభమైంది. ఐదేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ స్కీం కింద కేంద్ర, రాష్ట్రాలు, మున్సిపాలిటీల భాగస్వామ్యంతో ఈసారి 2 లక్షల 99 వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలని నరేంద్రమోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు బండి సంజయ్.

అంతేకాకుండా.. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూపాయలను కేటాయించబోతున్నామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు సమీకరించుకోవాల్సి ఉందని వెల్లడించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమృత్ 1, అమృత్ 2 కింద మొత్తం 852 కోట్ల 11 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. అందులో కేంద్ర వాటా 481 కోట్ల 19 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 297 కోట్ల 55 లక్షలు, మున్సిపాలిటీల వాటా 73 కోట్ల 37 లక్షలు. అందులో భాగంగానే చొప్పదండి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో ఇంటింటికీ నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఇందులో కేంద్ర ప్రభుత్వం 17 కోట్ల 89 లక్షలు, రాష్ట్రం వాటా 15 కోట్ల 11 లక్షలు, మున్సిపాలిటీ వాటా 3 కోట్ల 30 లక్షలు. ఈ పథకము ద్వారా నల్లాల బావివద్ద వాటర్ సంప్, 46.21 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మాణంతోపాటు 1500 కి మీ ఈ ఎల్ బి ఆర్, ఈ ఎల్ ఎస్ ఆర్ లను ఏర్పాటు చేస్తున్నామని ఈ స్కీం ద్వారా 2 వేల 800 నల్లా కనెక్షన్లకు నీటిని సరఫరా చేయబోతున్నామని అన్నారు.

వాస్తవానికి చొప్పదండిలో ఎప్పుడో ఈ స్కీంను స్టార్ట్ చేయాల్సి ఉండేదని,గత ప్రభుత్వం సహకరించకపోవడంవల్ల ల్యాండ్ కేటాయించలేదు. లేకుంటే ఈ స్కీం ఇప్పటికే ప్రారంభమయ్యేదని తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులను పూర్తి చేసి చొప్పదండి ప్రజలకు ఇంటింటికీ సరిపడా నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ, అమ్రుత్ నిధులు రావడం కరీంనగర్ పార్లమెంట్ ను అభివ్రుద్ధి చేసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. దీంతోపాటు సీఆర్ఐఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్లను నిర్మిస్తున్నాం. ఇవిగాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నాం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కేంద్ర ప్రభుత్వ సహకారంతో చొప్పదండి పట్టణ ప్రజలకు ఇంటింటికీ నీటిని సరఫరా చేయబోతున్నామని,అతి త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివ్రుద్ధిలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు.




Next Story