Viral: విరోష్ పెళ్లిపై చిన్నారి అలక.. 'మమ్మల్ని ఎందుకు పిలవలేదంటూ' సోషల్ మీడియాలో వైరల్

by Ramesh Naini |

ఒక చిన్నారి అభిమాని, తనను విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లికి పిలవలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Viral: విరోష్ పెళ్లిపై చిన్నారి అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదంటూ సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత నెల ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. అయితే, ఈ 'విరోష్' పెళ్లి వేడుక ముగిసినా, దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది. తాజాగా ఓ చిన్నారి అభిమాని ఈ స్టార్ జంటపై అలిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి అనంతరం విజయ్ దేవరకొండ తన సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి ముచ్చట్లే వినిపించాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా, దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. స్వయంగా విజయ్ జంట కూడా అభిమానులతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

మమ్మల్ని ఎందుకు పిలవలేదు?

ఈ వేడుకలన్నీ చూస్తున్న ఒక చిన్నారి అభిమాని, తనను పెళ్లికి పిలవలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి తన క్యూట్ వాయిస్‌తో అడిగిన ప్రశ్నలు నెటిజన్లను ఆలోచింపజేయడమే కాకుండా నవ్వులు పూయిస్తున్నాయి. ‘విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు కదా.. మేం కూడా ఫ్యాన్స్‌మే కదా, మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మేం కూడా మీ కోసం రీల్స్ చేస్తున్నాం కదా! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి’ అంటూ ఆ చిన్నారి సూటిగా ప్రశ్నించింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాది కూడా అదే ప్రశ్న చిన్ని తల్లి.. మమ్మల్ని కూడా పిలవలేదు’ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఆ చిన్నారి అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు. ‘నువ్వు ఇప్పుడు వైరల్ అయిపోయావు కదా, త్వరలోనే వాళ్లే నిన్ను పిలుస్తారులే’ అంటూ బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను విజయ్, రష్మికల సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేస్తూ, ఆ చిన్నారిని కలవాలని కోరుతున్నారు. ఈ వీడియోపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో చిన్నారిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story