ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్ రెడ్డి.. భారీ బహిరంగ సభ

by Prasad Jukanti |

ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులతో పాటు భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్ రెడ్డి.. భారీ బహిరంగ సభ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 28న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.13,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే నల్లగొండలో అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ పర్యటన కోసం సీఎం హైదరాబాద్ నుండి హెలికాప్టర్‍లో బయలుదేరి నల్లగొండ జిల్లా కనగల్ మండలం చేరుకుంటారు. అక్కడ మొదట మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కనగల్ మండలం AMC మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‍ను ఆవిష్కరించనున్నారు. అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‍లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ:

అభివృద్ధి పనుల శంకుస్థాపనల అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం, జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున చెక్కులను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.

Next Story