- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసులు కురిపిస్తున్న చెక్‌పోస్టులు.. మామూళ్లకు మరిగిన రవాణా శాఖ అధికారులు
ఇసుక అక్రమ రవాణా.. రవాణాశాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక అక్రమ రవాణా.. రవాణాశాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నది. ఓవర్ లోడ్ ఉంటే చెక్ పోస్టుల వద్ద లారీకి రూ. వెయ్యి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఖనిజాభివృద్ధి సంస్థ 1600 వాహనాలను ఎంప్యానల్ చేసుకున్నది. ఇవే కాకుండా మరో 600 వరకు లారీలు కూడా రవాణాలో భాగస్వాములవుతాయని మైనింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇసుక లారీలు రవాణాశాఖ అధికారులు కాసులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం, భద్రాచలం, కరీంనగర్ జిల్లాల నుంచి ఇసుక నగరంతోపాటు ఇతర జిల్లాలకు రవాణా అవుతున్నది. ఈ మేరకు వరంగల్, ఖమ్మం రహదారిలో ఉన్న చెక్ పోస్టుల వద్ద అధికారులు ప్రతి లారీని తనిఖీ చేస్తారు. అయితే లారీలో నిబంధనల కంటే ఎక్కువ ఇసుక ఉంటే.. పక్కనే ఉన్న టెంటులోకి వెళ్లి ఒక డబ్బాలో నగదు వేసి వెళ్లాల్సిందేనని ప్రచారం జరుగుతున్నది. కరీంనగర్ రూట్లలో మూడు చెక్ పోస్టులకు కలిపి ఒకే అధికారి ముడుపులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ట్రిప్ కు కాకుండా నెలవారీగా రూ. 25 వేలు ఇస్తే బరువు ఎంత అధికంగా ఉన్న ఫర్వాలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఒకవేళ అధికారుల కన్నుగప్పి పోతే.. దొరికిన చోటే నెలకు రోజులకు సరిపడా లంచం ఒకే సారి చెల్లించక తప్పదనే చర్చ ఉన్నది. అంతేకాకుండా లారీ యాజమానుల సంఘానికి చెందిన ఒక నాయకుడు ప్రతి లారీ వద్ద మామూళ్లు వసూలు చేసి రవాణా శాఖ అధికారులకు ముట్టజెబుతారనే ఆరోపణలు ఉన్నాయి. తమ చేతికి నోట్లు అంటకుండా అధికారులు దర్జాగా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
పోస్టింగులకు తీవ్ర పోటీ
ఇసుక క్వారీలు ఉన్న జిల్లాల్లో విధులు నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తున్నది. రూ.య కోట్లు లంచాలు ఇచ్చి పైరవీలు చేసుకుంటూ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారనే చర్చ ఉన్నది. ఆదాయం ఉన్న ప్రాంతాల్లో కొందరు అధికారులు సిండికేట్ గా మారి.. వారిలో కొందరికే పోస్టింగ్ వచ్చేలా చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిగతా అధికారులను ఆయా ప్రాంతాలకు రానివ్వడం లేదనే ప్రచారం జరుగుతున్నది.
చెక్‌పోస్టుల రద్దుకు ప్రభుత్వం రంగం సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు చెందినవి 15 చెక్‌పోస్టులు ఉన్నాయి. వాంకిడి, అలంపూర్, కృష్ణా, సాలూర, ఆదిలాబాద్, జహీరాబాద్, మద్నూర్, బైంసా, నాగార్జునసాగర్, విష్ణుపురం, కోదాడ, కల్లూర్, అశ్వారావుపేట, పాల్వంచ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మరొకటి కామారెడ్డిలో ఉంది. ఒక్కో చోట 8 నుంచి 14 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు, పర్మిట్లను చెక్ పోస్టుల్లో తనిఖీ చేయాలి. కానీ అవి అవినీతికి అడ్డాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో చెక్‌పోస్టు దగ్గర పర్మిట్ లేని వాహనాల నుంచి నామమాత్రపు జరిమానాలే విధిస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చాక జిల్లాల్లో అంతకు ఎన్నో రెట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రవాణా శాఖ చెక్‌పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం.






