- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైరవీలకు చెక్.. సీనియారిటీకే మొగ్గు: IAS బదిలీలపై సీఎం రేవంత్ మార్క్!
తెలంగాణలో ఐఏఎస్ బదిలీల్లో పైరవీలకు తావులేకుండా సీనియారిటీ, సమర్థతకే ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎలాంటి పైరవీలు, లాబీయింగ్ లేకుండా.. సీనియార్టీ ప్రకారం ప్రతి ఒక్క ఐఏఎస్‌నూ కలెక్టర్‌గా నియమిస్తున్నాం. అక్కడ సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు హెచ్ఓడీగా బాధ్యతలు అప్పగిస్తాం. అక్కడ కూడా ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంగా పని చేస్తే.. వారిని వివిధ శాఖలకు సెక్రెటరీలుగా అపాయింట్ చేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. తాజాగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తాజా ట్రాన్స్ ఫర్స్‌లో 2019 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐఏఎస్‌లను వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా నియమించారు. అంతకుముందు సదరు ఐఏఎస్‌లు అదనపు కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా పనిచేశారు. దీంతో ఆ తర్వాత బ్యాచ్‌లకు చెందిన ఐఏఎస్‌లు సైతం త్వరలోనే తమకు కూడా కలెక్టర్లుగా పనిచేసే అవకాశం వస్తుందనే ధీమాలో ఉన్నారు.
కలెక్టర్ పోస్టు.. ఐఏఎస్‌ల డ్రీమ్
ప్రతి ఐఏఎస్ అధికారి తన కెరీర్‌లో జిల్లా కలెక్టర్‌గా పనిచేయాలని డ్రీమ్ పెట్టుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ ఆ జిల్లాకు బాస్. ఆయన కనుసన్నల్లోనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. జిల్లా పాలనా యంత్రాంగం మొత్తం ఆయన ఆధీనంలో పనిచేస్తుంటుంది. దీంతో ఐఏఎస్‌లు కలెక్టర్‌గా పనిచేసేందుకు పోటీ పడుతుంటారు. సర్వీసులోకి వచ్చిన రెండు, మూడేళ్ల నుంచే ఆ పోస్టులో కూర్చునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.
నాటి సర్కారులో లాబీయింగ్‌కు ప్రయారిటీ
బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్‌గా పనిచేయాలంటే సమర్థతతో సంబంధం లేకుండా పైరవీలు, లాబీయింగ్ చేసిన ఐఏఎస్‌లకే ప్రయారిటీ ఇచ్చే వారనే విమర్శలు ఐఏఎస్ వర్గాల్లో ఉన్నాయి. ‘గత సర్కారులో కేవలం లాబీయింగ్ చేసిన అధికారులకే కలెక్టర్లుగా పనిచేసే అవకాశం వచ్చేది. పాలనలో ఎంత సమర్థవంతంగా పనిచేసినా.. పట్టించుకునే వారు కాదు. దీంతో కొందరికి కలెక్టర్లుగా పనిచేసే అదృష్టం దక్కలేదు’ అని ఓ సీనియర్ ఐఏఎస్ నాటి సర్కారులో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత సర్కారులో మాత్రం అందుకు విరుద్ధంగా సీనియార్టీ ప్రకారం ఐఏఎస్‌లు అందరినీ కలెక్టర్‌గా అపాయింట్ చేయడం శుభపరిణామం అని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ‘బోయి విజయేంద్రకు ఐఏఎస్‌గా 2006లో ప్రమోషన్ వచ్చింది. సమర్థురాలైన అధికారిగా ఆమెకు పేరు ఉంది. కానీ, కేసీఆర్ హయాంలో ఆమెను కలెక్టర్‌గా నియమించలేదు. ఆమె కంటే జూనియర్లు, నాన్ ఐఏఎస్‌లను కలెక్టర్లుగా అపాయింట్ చేశారు. కానీ, రేవంత్ సర్కారులో మాత్రం ఆమెను మహబూబ్ నగర్ కలెక్టర్‌గా నియమించారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఆమె పనితీరును చూసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ శాఖకు కమిషనర్‌గా నియమించారు’ అని ఓ ఐఏఎస్ అధికారి వివరించారు.
కలెక్టర్‌గా పనిచేసిన వారికే సీఎస్‌గా చాన్స్!
ప్రతి ఐఏఎస్ తన కెరీర్ చివరలో చీఫ్ సెక్రెటరీగా పనిచేసి రిటైర్డ్ కావాలని ఆశపడుతుంటారు.అయితే, ప్రభుత్వ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించాలంటే సదరు ఐఏఎస్‌కు కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉందా? లేదా? అని చూస్తుంటారు. ఎందుకంటే కలెక్టర్‌గా పనిచేసిన అనుభవమున్న అధికారికి ప్రభుత్వ స్కీమ్స్ అమలు, విపత్తుల నిర్వహణ ఎలా చేయాలో ఫీల్డ్ అనుభవం ఉంటుంది. దీంతో సీఎస్ హోదాలో ఉన్న అధికారి పాలనా యంత్రాంగాన్ని సులువుగా మానిటరింగ్, గైడెన్స్ చేస్తుంటారు.






