విద్యుత్ అంతరాయాలకు చెక్.. సమగ్ర నెట్‌వర్క్ మ్యాపింగ్

by Malleboina Mahesh |

విద్యుత్ సమస్యలను క్షణాల్లో గుర్తించేలా ప్రతి కనెక్షన్ డిజిటలైజ్ చేసేందుకు తెలంగాణలో నేటి నుంచే TGSPDCL సమగ్ర విద్యుత్ నెట్‌వర్క్ మ్యాపింగ్ ప్రారంభించనుంది.

విద్యుత్ అంతరాయాలకు చెక్.. సమగ్ర నెట్‌వర్క్ మ్యాపింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వినియోగదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన విద్యుత్ సేవలందించేందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) సరికొత్త సాంకేతిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జులై 1వ తేదీ నుంచి తన పరిధి వ్యాప్తంగా సమగ్ర విద్యుత్ నెట్‌వర్క్ మ్యాపింగ్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. తొలి దశలో ఈ కార్యక్రమాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శకత్వంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితిష్ వి.పాటిల్ ఈ వినూత్న డ్రైవ్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ప్రతి కనెక్షన్ డిజిటల్ మ్యాపింగ్..

ఈ డ్రైవ్ ద్వారా 132/33 కేవీ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ల నుంచి పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), చివరకు ప్రతి వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్ వరకు పూర్తి విద్యుత్ నెట్‌వర్క్ అనుసంధానాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. జులై నెల బిల్లింగ్ ప్రక్రియలో భాగంగా మీటర్ రీడర్లు క్షేత్రస్థాయిలో ప్రతి డీటీఆర్‌ను సందర్శించి, ఆయా ట్రాన్స్‌ఫార్మర్లకు అనుసంధానమైన వినియోగదారుల సర్వీసులను ఖచ్చితంగా మ్యాపింగ్ చేయనున్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు సమస్య ఫీడర్ స్థాయిలో ఉందా, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉందా లేదా వ్యక్తిగత కనెక్షన్‌లో ఉందా? అనేది వ్యవస్థ ఈజీగా గుర్తిస్తుంది.

ఫిర్యాదు చేసిన వెంటనే వివరాలు..

1912 కాల్ సెంటర్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే.. సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలు, పునరుద్ధరణకు పట్టే సమయాన్ని వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. స్మార్ట్ గ్రిడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అవుటేజ్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక వ్యవస్థల అమలుకు ఈ డేటా బలమైన పునాదిగా నిలుస్తుంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో డిజిటలైజేషన్‌ను విస్తృతంగా వినియోగించడం ద్వారా వినియోగదారులకు నమ్మకమైన సేవలను అందించడమే మా లక్ష్యం. ఈ సమగ్ర నెట్‌వర్క్ మ్యాపింగ్ భవిష్యత్ విద్యుత్ రంగానికి మైలురాయిగా నిలుస్తుంది.:- టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితిష్ వి.పాటిల్

Next Story