- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టణ ప్రగతికి బడ్జెట్ బాట.. ఆదాయ మార్గాలపై నజర్
కొత్తగా కొలువుదీరిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నిర్వహణకు వార్షిక బడ్జెట్ రూపకల్పన చేసేందుకు కసరత్తులు మొదలయ్యాయి. బడ్జెట్ ప్రతిపాదనల చర్యలను ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాల కొలువు దీరాయి. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నిర్వహణకు వార్షిక బడ్జెట్ తప్పనిసరి. దీంతో వార్షిక బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేయర్లు, చైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు తయారుచేయడానికి చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత బడ్జెట్ ఆమోదించడానికి స్పెషల్ కౌన్సిల్ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తిచేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 133 యూఎల్బీలు
రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 131 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
బడ్జెట్ రూపకల్పన ఇలా..
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయం, ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వంటి పనుల ఆధారంగా బడ్జెట్ రూపొందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్, టెండర్లకు సంబంధించిన ఈఎండీ(డిపాజిట్లు)ల ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తారు. తర్వాత మున్సిపాలిటీల పరిధిలో రోడ్ల నిర్వహణ, డ్రెయినేజీ, శానిటేషన్ వంటి పనులకు ఖర్చులను లెక్కించనున్నారు. వీటితోపాటు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, ఆర్థిక సంఘం నిధులు ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుని 10-20శాతం పెంచి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఈ బడ్జెట్‌లో 10శాతం తప్పనిసరిగా గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది.
కలెక్టర్ పరిశీలన.. కౌన్సిల్ ఆమోదం..
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్ పరిశీలించడంతో పాటు ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేస్తారు. అనంతరం వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. మేయర్, చైర్మెన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సభ్యులు చర్చించి, ఆమోదించిన తర్వాత కలెక్టర్‌కు పంపించనున్నారు. కలెక్టర్ నుంచి మున్సిపల్ శాఖ కమిషనర్ ఆఫీసుకు పంపించనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది.






