- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శం.. కేంద్ర మంత్రి బండి సంజయ్
ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతోన్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతోన్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. ఇవాళ ఆయన చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికారు. అనంతరం జైలు ఆవరణలో చేపట్టిన అభివృద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమని కొనియాడారు.. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్‌ను అభినందించకుండా ఉండలేమన్నారు. కస్టడీ-కేర్-కరక్షన్‌కు సౌమ్య మిశ్రా నిజమైన ఆచరణ రూపమిస్తున్నారని ప్రశంసించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గోశాలను సందర్శించారు. గోవులకు స్వయంగా తన చేతితో మేత తినిపించారు. ఒక లేగ ఆవుకు ‘కృష్ణ’ అని నామకరణం చేశారు. జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, బంతి పూల వనాన్ని సందర్శించారు. తేనెటీగలతో తేనె ఏ విధంగా తీస్తున్నారో కళ్లారా వీక్షించారు.
అనంతరం ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. 25 ఏళ్ల క్రితం చర్లపల్లి జైలును నిర్మించారని నాటి నుంచి నేటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి జైలు డెవలప్‌మెంట్ కోసం ఇప్పటి వరకు రూ.11.60 కోట్లు మంజూరు చేయగా రూ. 11.30 కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లుగా సౌమ్య మిశ్రా పేర్కొన్నారు.
సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మకంగా సంస్కరణలు చేపట్టారని బండి సంజయ్ అన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వీడియో లింక్ ద్వారా తాము ఉన్న ప్రాంతాల నుండే మాట్లాడే (ములాఖత్) అవకాశాన్ని కల్పించినట్లుగా పేర్కొన్నారు. ఖైదీలకు బీమా సౌకర్యాన్ని వర్తింపజేసినట్లుగా తెలిపారు. వారు చదువుకునేందుకు విస్తృత అవకాశాలు కల్పించడంతో పాటు చదవు పూర్తయ్యాక డిగ్రీలు కూడా అందజేశారని అన్నారు. ఖైదీల హెల్త్పై ప్రత్యేక దృష్టి సారించామని, నిష్ణాతులైన డాక్టర్లను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సగటున 150 మంది వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని, ప్రతి రోగికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించామని సౌమ్య మిశ్రా బండి సంజయ్‌కి తెలిపారు.
ఖైదీలకు స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఖైదీలు విడుదలైన తరువాత పెట్రోలు బంకుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి నెలా రూ.18 వేల చొప్పున కనీస వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, క్రీడా విషయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. క్రీడా పోటీల్లో తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు అగ్రగామిగా నిలుస్తున్నారని తెలిపారు. జైళ్ల శాఖ అందిస్తున్న సేవలు, చేస్తున్న అభివృద్ధికి గాను ప్రతిష్టాత్మకమైన స్కోడా అవార్డు కూడా చర్లపల్లి జైలుకు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






