- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంచల్‌గూడ ‘అండా’ సెల్‌లో వేయాలి’.. గరికపాటిపై ఆర్‌ఎస్‌పీ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ‘మధ్యాహ్న భోజన పథకం’పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదానికి దారితీశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ‘మధ్యాహ్న భోజన పథకం’పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదానికి దారితీశాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పై గరికపాటి చెప్పిన మాటలు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నెటిజన్‌లు గరికపాటిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. గరికపాటి తన మనసులో మాటను చెప్పాడని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. నిజానికి ఈ సమాజంలో చాలామంది ఆధిపత్య వర్గాల పెద్దలకు-మేధావులకు తరతరాలుగా పేద వారి చదువులు, తినే తిండి మీద గరికపాటి లాంటి చులకన భావమే ఉంటుందని, దీనికి నా వద్ద వందల ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
వాళ్లు నటిస్తారు, ఈయన నటించలేదు..
అయితే, వాళ్లు నటిస్తారు, ఈయన నటించలేదని అన్నారు. అందుకే పేదరికం వివక్ష అనేవి ఈ దేశంలో నేటికీ పోవడం లేదని, రోహిత్ వేముల లాంటి వారు బలవుతూనే ఉన్నారని ఆవేదన చెందారు. గరికపాటి గడ్డి మాటలే కాదు, ఆయన అట్లా కడుపు నిండిన ప్రవచనాలు చేస్తుంటే చప్పట్లు కొడుతున్న మూర్ఖులను చూసి జాలి వేస్తున్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న దళిత ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి మీద కోడి గుడ్ల దాడి చేసిన బండి సంజయ్ - బీజేపీ గ్యాంగ్ ఇప్పుడు బ్రాహ్మణ వర్గానికి చెందిన గరికపాటి ఇంటికి పోతరా? ముమ్మాటికీ పోరు.. అని ఆర్ఎస్పీ విమర్శించారు. ‘మీరు చూస్తూ ఉండండి.. పోలీసులు కూడా కేసులు పెట్టరు.. జాతీయ బాలుర సంఘం, మానవ హక్కుల సంఘం ఇతనిని పిలవను కూడా పిలవదు’ అని అభిప్రాయం తెలిపారు. ‘పేద పిల్లలు పోషకాహారం తినకుండా అస్థిపంజరాలుగా మారి, వీళ్ల (BJP-Congress) జెండాలు మోసే రోబోలుగా మారి గరికపాటి లాంటి వారి ప్రసంగాలకు చప్పట్లు కొడుతూ, ఓట్లేస్తూ ఉంటే చాలు.. గరికపాటి, అతని లాంటి వారిని కేసు పెట్టి చంచల్ గూడ ‘అండా’ సెల్ లో వేయాలి.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞానం వికసిస్తుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
కాగా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, బట్టలు వంటివన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల వారిలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ తగ్గుతున్నాయని గరికపాటి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు తమ ప్రధాన వృత్తి అయిన బోధనను వదిలేసి, మధ్యాహ్న భోజనం వండించడం, గుడ్ల లెక్కలు రాయడానికే సమయం కేటాయిస్తున్నారని ఆయన విమర్శించినట్లు ఆ వీడియోలో ఉంది. విద్యాసంస్థలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సింది పోయి, కేవలం భోజనశాలలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పెట్టే గుడ్డును గాడిద గుడ్డు, శోభనం గదిలో పెళ్లికొడుకులా పిల్లలు భోజనం కోసం కూర్చుకుంటున్నారని అంటూ విమర్శలు వీడియోలో గరికపాటి అన్నట్లుగా షార్ట్ వీడియోలో కన్పిస్తోంది.






