- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కత్తిమీద సాములా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. కాంగ్రెస్‌లో నో కో-ఆర్డినేషన్
‘మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏడుగురు మంత్రులకు ఛాలెంజ్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏడుగురు మంత్రులకు ఛాలెంజ్‌గా మారింది. అక్కడ గెలవకపోతే అటు పార్టీకి, ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. రెండు మూడు రోజులుగా జిల్లా ఇన్ చార్జి మంత్రులు ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నేరుగా ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే, మెజార్టీ ఏరియాల్లో అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టీంకు, కాంగ్రెస్ లీడర్ల మధ్య సఖ్యత లేదని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
సవాలుగా మారిన ఎన్నిక..
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కంటే పార్టీ, ప్రభుత్వ ఇమేజ్‌కు పెద్ద సవాలుగా మారిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఈ ఎన్నికల ఫలితాలు 13 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు విద్యావంతులు ఇస్తున్న తీర్పుగా భావించవచ్చనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. మరోవైపు ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిపొందారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించపోతే ఆ ప్రభావం భవిష్యత్‌లో జరగనున్న ఎన్నికలపై పడే ప్రమాదం ఉంటుంది. అందుకని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా లీడర్లు కలిసి కట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం రేవంత్ పదే పదే గుర్తుచేస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లా మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇన్ చార్జి మంత్రులు సీతక్క(అదిలాబాద్), కొండా సురేఖ(మెదక్), ఉత్తమ్ కుమార్ రెడ్డి(కరీంనగర్), జూపల్లి కృష్ణరావు(నిజామాబాద్) నాలుగైదు రోజుల పాటు పూర్తిగా ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మండలం, జిల్లా కేంద్రాల వారీగా నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అభ్యర్థి పట్ల నెగెటివ్ ఫీలింగ్
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పట్ల మెజార్టీ కాంగ్రెస్ లీడర్లు నెగెటివ్ ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకు ప్రధాన కారణం నామినేషన్ వేసే వరకు తమను పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఆయన గెలుపు కోసం ఎందుకు పనిచేయాలని మంత్రులను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థి తన విద్యా సంస్థల ద్వారా వ్యాపారం చేసుకుని కోట్లు గడించాడే తప్ప ఎవరికీ సహాయం చేయలేదని, పైసా ఫీజు కూడా తగ్గించలేదని మండిపడుతున్నారు. మెజార్టీ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారనే విషయాన్ని కేడర్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నది.
అభ్యర్థి సొంత నెట్‌వర్క్‌పై లీడర్లు గుస్సా..
ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే టార్గెట్‌తో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అడుగులు వేశారు. తన సొంత నెట్‌వర్క్ ద్వారా ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక నరేందర్ రెడ్డి పనితీరులో మార్పు రాలేదని విమర్శలు ఉన్నాయి. స్థానిక కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోకుండా తన విద్యాసంస్థల ఉద్యోగులకే ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో చాలా మంది పార్టీ లీడర్లు తమకు సంబంధం లేదనే తీరుగా వ్యవహరిస్తున్నారని టాక్. ఎన్నికల వరకు కేడర్ సాయం లేకుండా సొంత ఉద్యోగులతో ప్రచారానికి వెళితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అంత సులువు కాదనే చర్చ జరుగుతున్నది.






