పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరం: ఉన్నత విద్యా మండలి చైర్మన్

by Ramesh Naini |

ఉన్నత విద్యా రంగం అంతర్జాతీయకరణ చెందుతున్న నేపథ్యంలో, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య లోతైన సహకారం ఉండాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి పిలుపునిచ్చారు.

పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరం: ఉన్నత విద్యా మండలి చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యా రంగం అంతర్జాతీయకరణ చెందుతున్న నేపథ్యంలో, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య లోతైన సహకారం ఉండాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్), వరల్డ్ ట్రేడ్ సెంటర్ (శంషాబాద్) సంయుక్తంగా నిర్వహించిన లెవరేజింగ్ యూఎస్ ఇండియా ట్రస్ట్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశ్రమ విద్యాసంస్థల భాగస్వామ్యంపై జరిగిన ఈ చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని తెలిపారు. నాస్కామ్, బీడీఎంఏ వంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి అవసరమని, గ్లోబల్ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

అంతర్జాతీయ సహకారం:

తెలంగాణలో ఉన్న సాంకేతిక విద్యాసంస్థలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానం చేయాలని ఆయన ప్రపంచ స్థాయి పరిశ్రమలను కోరారు. ఇండో యూఎస్ 2025 ట్రస్ట్ చొరవలో భాగంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో తెలంగాణ, అమెరికా విశ్వవిద్యాలయాల మధ్య నెట్‌వర్క్ ఏర్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అడ్డంకులను తొలగించి, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారానే అర్థవంతమైన భాగస్వామ్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

Next Story