- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా
సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది.

- ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
- 25 ఏళ్లపాటు కొనసాగనున్న బొగ్గు తవ్వకాలు
- సింగరేణి చరిత్రలో సరికొత్త అధ్యాయం
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుండి సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం అధికారిక సమాచారం అందింది. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయి అనుమతి పత్రాలు రానున్నాయి. సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గనిర్దేశంలో డైరెక్టర్లు, అధికారులు చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించడంతో సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించడం విశేషం.
314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయడమే లక్ష్యం
ముఖ్యంగా మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్, త్వరలో మూతబడనున్న వకీల్ పల్లి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీస్తారు. వీటికి ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ 2, రామగుండం ఓపెన్ కాస్ట్-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచులలో మిగిలిన బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీయడం కోసం వీటన్నిటినీ కలిపి ‘రామగుండం కోల్ మైన్’ అనే ఒక విశిష్ట ప్రాజెక్టుగా మార్చారు.






