‘ఏపీ తన అజెండాను చెప్పలేదు!’.. ముగిసిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం

by Ramesh Naini |   (  Updated:2026-01-30 12:16:46  IST  )

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది.

‘ఏపీ తన అజెండాను చెప్పలేదు!’.. ముగిసిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఢిల్లీలోని కేంద్ర జలసంఘం (CWC) కార్యాలయంలో జలసంఘం ఛైర్మన్‌ అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులు, కృష్ణా నది యాజమాన్య మండలి (KRMB), గోదావరి నది యాజమాన్య మండలి (GRMB), నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) ఛైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్‌, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తెలంగాణ తరఫున 12 అంశాలు

సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తరఫున 12 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులను అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన అజెండాను వెల్లడించలేదని రాహుల్ బొజ్జ తెలిపారు. తదుపరి సమావేశం నిర్వహణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వివాదాల పరిష్కారంపై అధికారుల కమిటీ తొలిసారి భేటీ కావడం విశేషంగా భావిస్తున్నారు.

Next Story