- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ఆర్దిక రంగంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ మేధావి పీవీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దేశ రాజకీయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న మహానాయకుడు పీవీ నరసింహారావు, ప్రపంచంలో భారతదేశం ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోందంటే, ఆయన మేధస్సు గొప్పతనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ రాజకీయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న మహానాయకుడు పీవీ నరసింహారావు, ప్రపంచంలో భారతదేశం ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోందంటే, ఆయన మేధస్సు గొప్పతనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. మంగళవారం పీవీ 21 వర్థంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని ఘాట్‌వద్ద నివాళులర్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ బిడ్డగా, తెలుగు ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ యువజన విధానం రూపకల్పన జరుగుతుండగా, తాను ఏర్పాటు సమావేశానికి హాజరై దేశంలో యువజన విధానం ఏ విధంగా ఉండాలన్న విషయంపై అనేక కీలక సూచనలు చేసిన మహానుభావుడని చెప్పారు.
అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యమయ్యేలా మంచి యూత్ పాలసీ డ్రాఫ్ట్ తయారు చేయాలని సూచించారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిన సమయంలో, దానిని తిరిగి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రిగా ధృఢమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో వివిధ దేశాల సమావేశాలకు భారతదేశం తరఫున నాటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రతినిధిగా పంపించడం ఆయన రాజకీయ విశాలతకు నిదర్శనమన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందంటే, అందులో కూడా పీవీ పాత్ర ఉందని తెలిపారు. ఆ సమయంలో ఉద్యమాన్ని అణిచివేయాలని ఆయనపై ఒత్తిడి వచ్చినప్పటికీ, రామజన్మభూమి విషయంలో ఎప్పుడూ వ్యతిరేకత చూపలేదన్నారు.
చివరకు వివాదాస్పద ఘటనల సమయంలో మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ విమర్శించినా ఎలాంటి వ్యతిరేకత చూపకుండా రామజన్మభూమి విషయంలో అనుకూలంగా స్పందించారని చెప్పారు. 20 సంవత్సరాల క్రితం పీవీ పరమపదించగా, ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా తీసుకెళ్లనీయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడి అన్ని విధాల సహకారం అందించిన గొప్ప నేతకు అదే కాంగ్రెస్ తీవ్ర అవమానం చేసిందని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు గౌరవించే పరిపాలన దక్షుడు, మేధావి, సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు మన తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమని అన్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ఆయన రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికే రాజకీయాలు పరిమితం కావాలని, ఈతరం నాయకులు సంయమనం పాటించాలని కోరారు.






