ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ కృషి.. ‘బనకచర్ల’కు అనుమతులు నిరాకరించిన కేంద్రం

by Gantepaka Srikanth |

బనకచర్లపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఒత్తిళ్ల మేరకు ప్రాజెక్టు అనుమతులపై వెనక్కి తగ్గింది. గోదావరి నదిపై నిర్మిస్తున్న బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ కృషి.. ‘బనకచర్ల’కు అనుమతులు నిరాకరించిన కేంద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బనకచర్లపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఒత్తిళ్ల మేరకు ప్రాజెక్టు అనుమతులపై వెనక్కి తగ్గింది. గోదావరి నదిపై నిర్మిస్తున్న బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ప్రాజెక్టు కోసం కోరిన పర్యావరణ అనుమతులను తిరస్కరించింది. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోరాటానికి ఫలితం లభించింది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని కేంద్రం ముందు చాలా సందర్భాల్లోనూ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును ఒప్పుకునేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. అందులో భాగంగా కేంద్రానికి లేఖలు రాసి ఊరుకోకుండా.. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను సైతం కలిశారు. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. అవసరమైతే న్యాయపోరాటానికీ వెళ్తామని చెప్పారు.

కేంద్రంపై తీవ్ర ఒత్తిడి..

ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మించ తలపెట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా 1980 గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డును, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలుపుతూ జనవరి 22, 2025న కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి మంత్రులకు లేఖలు రాశారు. అయితే.. దీనికి సంబంధించి మే 28, 2025న కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నుండి రిప్లై వచ్చింది. గోదావరి-బనకచర్ల లింక్ స్కీమ్‌కు సంబంధించి డీపీఆర్ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి అందలేదని, అందిన తర్వాత అమలులో ఉన్న మార్గదర్శకాలు, ప్రస్తుత ట్రిబ్యునల్ అవార్డులు/అంతర్రాష్ట్ర ఒప్పందాలు/ఏపీఆర్ఏ 2014లోని వివిధ నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే.. జూన్ 3న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను న్యూఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. రేవంత్‌రెడ్డి కూడా మార్చి 3న ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలుపుతూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. జూన్ 13న కూడా కేంద్ర జల్ శక్తి మంత్రికి మరో లేఖ రాశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కోరారు.

ఎంపీలతో అఖిలపక్ష సమావేశం

బనకచర్లపై కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలతో అఖిలపక్షం సమావేశం సైతం నిర్వహించింది. అన్నిపార్టీల ఎంపీలను ఆహ్వానించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. బనకచర్లతో రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరగబోతున్నదో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టును నిర్మాణాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని అంతా ఏకగ్రీవానికి వచ్చారు. అటు బీజేపీ నుంచి కూడా ఎంపీలు హాజరయ్యారు. వారు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రభుత్వం ప్రయత్నించింది. దాంతో కేంద్రం ఎట్టకేలకు పర్యావరణ అనుమతులు నిలిపివేస్తూ రిప్లై ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

నేడు ప్రజాప్రతినిధులకు పీపీటీGovtకాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు నేడు బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించే ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ బృందం మొత్తంగా హాజరుకానుంది. ప్రధానంగా ప్రాజెక్టుపై అందరికీ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

Next Story