SIR: ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఆదేశం.. తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాల్లో ఈసీ భారీ కసరత్తు

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, పటిష్టంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగు వేసింది.

SIR: ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఆదేశం.. తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాల్లో ఈసీ భారీ కసరత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, పటిష్టంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగు వేసింది. దేశంలోని 16 రాష్ట్రాల్లో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) మూడో దశను చేపట్టాలని ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ భారీ కసరత్తు ద్వారా సుమారు 36.73 కోట్ల మంది ఓటర్లను కవర్ చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలో ఉన్న తప్పులను తొలగించడం, డూప్లికేట్ ఓట్లను ఏరివేయడమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం.

అధికారులకు ఆదేశాలు..

సంబంధిత రాష్ట్రాల ఎన్నికల అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రతి ఇంటిని సర్వే చేయాలని ఈసీ సూచించింది. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందే యువత (18 ఏళ్లు నిండిన వారు) నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాల్లో పేర్కొంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాలో ఎటువంటి అవకతవకలు లేకుండా, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన డేటాను సిద్ధం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. గతంలో జరిగిన రెండు దశల విజయవంతమైన అమలు తర్వాత, ఇప్పుడు మూడో దశను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

Next Story