Central Budget: వేతన జీవులకు భారీ ఊరట..? రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్!

by Kema Shiva Kumar |

వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు.

Central Budget: వేతన జీవులకు భారీ ఊరట..? రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్!
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. ప్రధానంగా ఈవీ(ఎలక్ట్రానిక్ వాహనాల)పై పన్ను, క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు.

ఆదాయ పన్ను ప్రయోజనాలు..

గతేడాది మధ్యతరగతి వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇంటికి సంబంధించి ఇతర ఖర్చులు సైతం భారంగా మారడం, డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం ఏడాదికి రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. గతేడాది స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచిన కారణంగా ఇప్పుడు రూ.7.75 లక్షల వరకు మినహాయింపు లభిస్తున్నది. దీన్ని రూ.10 లక్షలకు పెంచే అంశంపై చర్చలు తీవ్రంగా సాగినట్టు సమాచారం.

అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించిన ఈ తరుణంలో పన్ను మినహాయింపును రూ.10 లక్షలకు పెంచడమే కాకుండా పన్ను శ్లాబుల్లో మార్పులకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి భారీ ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. గత బడ్జెట్‌లో సవరించిన పన్ను శ్లాబుల్లో రూ.10-12 లక్షలకు 15 శాతం, రూ.12-15 లక్షల ఆదాయంపై 20 శాతం, ఆపైన గరిష్ఠ శ్లాబుగా 30 శాతం పన్నును ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, దీనికి వచ్చే బడ్జెట్‌లో స్వల్పంగా మార్పులు చేస్తూ రూ.15-20 లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై 25 శాతం కొత్త పన్ను శ్లాబు తీసుకురావాలని ప్రతిపాదన ఉన్నది. దీనివల్ల ప్రస్తుతం రూ.15 లక్షలకు పైన ఆదాయానికి ఉన్న 30 శాతం పన్ను భారంలో 5 శాతం మేర తగ్గుతుంది. ఈ నిర్ణయం వెలువడితే రూ.15 లక్షలపైన ఆదాయం పొందే చాలామందికి ప్రయోజనకరంగా ఉండనుంది. తద్వారా వినియోగం పెరుగుతుందని, ప్రజలు ఎక్కువ ఖర్చు చేయగలరని నిపుణులు భావిస్తున్నారు.

హెచ్ఆర్ఏ పెంపు..!

గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద నగరాలే కాకుండా ఓ మోస్తరు పట్టణాల్లోనూ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ కేంద్రాలలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు హెచ్ఆర్ఏ(ఇంటి అద్దె అలవెన్స్) మినహాయింపును పెంచాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితి చాలాకాలం క్రితమే నిర్ణయించారు. ఇప్పుడు మెట్రో, ఇతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఈ భారాన్ని తగ్గించాలని వేతనజీవులు కోరుతున్నారు.

ఇండ్ల రుణాల్లో ప్రయోజనాలు..

అధిక ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చుల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ సెగ్మెంట్ కోసం సెక్షన్ 24(బి) కింద ఇళ్ల రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని, ఒక ఇంటి కోసం చెల్లించే మొత్తం వడ్డీపై మినహాయింపును ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, సరసమైన ఇళ్ల రుణాల మొత్తం పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం అవసరమని, మెట్రో నగరాల్లో ఖర్చులు, పెరిగిన స్థలాల రేట్ల భారాన్ని సమం చేసేందుకు ఈ పరిమితిని పెంచడం అనివార్యమన్నారు. అలాగే, హౌసింగ్ సెగ్మెంట్‌లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించడం, ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి కీలక ప్రయోజనాలను కోరుతున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్ పెంపు..

ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో రూ.50,000, కొత్త పన్ను విధానంలో రూ.75,000 ఉన్నది. పెరుగుతున్న ఖర్చులను లెక్కలోకి తీసుకుని ఈ పరిమితిని పెంచడం ద్వారా మధ్య తరగతికి ప్రయోజనం ఉంటుంది. కొత్త పన్ను విధానానికి మరింత ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా పన్ను చెల్లింపుదారుల్లో పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఇది ఆర్థిక వృద్ధికి సానుకూలమన్నారు.

సెక్షన్ 80డి మినహాయింపు..

ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద రూ.25 వేలుగా ఉన్న పన్ను మినహాయింపును రూ.50 వేలకు, సీనియర్ సిటిజన్‌లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచాలనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది.

ఎస్‌టీటీ భారం తగ్గించే చర్యలు..

గత బడ్జెట్‌లో పెట్టుబడి లాభాలపై అమలు చేసిన పన్నులను పునఃపరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లాభాలపై పన్నులు పెరిగిన కారణంగా స్టాక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ) తొలగించాలని పేర్కొన్నారు.

Next Story