బనకచర్లపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం.. తాజా అప్‌డేట్ ఇదే!

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి - బనకచర్ల (Godavari - Banakacharla) ప్రాజెక్టు అంశం‌ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన విషయం విదితమే.

బనకచర్లపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం.. తాజా అప్‌డేట్ ఇదే!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి - బనకచర్ల (Godavari - Banakacharla) ప్రాజెక్టు అంశం‌ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన విషయం విదితమే. తాము ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుకు అంగీకరించేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి తేల్చి చెప్పింది. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందకు కేంద్ర జల సంఘం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ మేరకు 2025 జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా, గోదావరి నదుల జల విభజన, బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులతో సహా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టుపై సాంకేతిక, పరిపాలనా అంశాలను పరిశీలించేందుకు ఈనెల 21లోపు ఓ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే భాగంగా మొత్తం 12 మందితో కేంద్ర జలసంఘం సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేసింది. కమిటీలో సభ్యుల పేర్లను పంపాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందజేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు సభ్యలుగా ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వర రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇవాళ వారి పేర్లను కేంద్ర జల సంఘానికి పంపనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి కమిటీ మెంబర్లపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, నీటి లభ్యత, పర్యావరణ ప్రభావాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి విభజనలో న్యాయం జరిగేలా ఓ రోడ్‌మ్యాప్ తయారు చేయడమే ఈ కమిటీ లక్ష్యమని తెలుస్తోంది.

Next Story