రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూలు.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అధికారులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-30 02:01:54  IST  )

జీహెచ్ఎంసీ మినహా 129 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో పురపాలకశాఖలోని కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది.

రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూలు.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ మినహా 129 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో పురపాలకశాఖలోని కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసింది. కాగా, గతేడాది ఇది రూ.922కోట్లు మాత్రమే. కాగా, రెండు రోజుల్లో మరో రూ.50 కోట్లు వసూలయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడంతో అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

టార్గెట్ రూ.1500 కోట్లు

సీడీఎంఏ పరధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 25 లక్షల టాక్స్ అసెస్ మెంట్స్ ఉన్నాయి. వీటి ద్వారా రూ.1500 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 15 లక్షలకుపైగా అసెస్ మెంట్స్ కు సంబంధించినవారు రూ.1010కోట్ల ఆస్తిపన్ను చెల్లించారు. ఈ రెండు రోజుల్లో మరో రూ.50కోట్లు వసూలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

పలు చోట్ల హండ్రెడ్ పర్సెంట్

సీడీఎంఏ పరిధిలోని 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 129 మున్సిపాలిటీల్లో రూ.1500కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేశారు. దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని నార్సింగ్, తుర్కయంజాల్, ఇబ్రహింపట్నం మున్సిపాలిటీల్లో 80శాతానికిపైగా వసూలైనట్టు అధికారులు చెబుతున్నారు.

సెలవులైనా అందుబాటులో ఉంటాం - కమిషనర్ టీకే శ్రీదేవి

సెలవు రోజులైనా.. ఆది, సోమవారాల్లో ఆస్తి పన్నువసూలు చేయడానికి అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని పురపాలక శాఖ కమిషనర్ టీకే.శ్రీదేవి తెలిపారు. రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడం గర్వంగా ఉందన్నారు. దీంతోపాటు పాతబకాయిలపై ఉన్న వడ్డీపై 90 శాతం ఇచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story