CDMAలో ఆ అధికారి గుత్తాధిపత్యం.. ఓకే అంటేనే ఫైళ్లు ముందుకు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 01:55:48  IST  )

సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోని పురపాలక, పట్టణాభివ్రుద్ది శాఖలో కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కీలక విభాగం.

CDMAలో ఆ అధికారి గుత్తాధిపత్యం.. ఓకే అంటేనే ఫైళ్లు ముందుకు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోని పురపాలక, పట్టణాభివ్రుద్ది శాఖలో కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కీలక విభాగం. అయితే ఇటీవల కాలంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను ప్రభుత్వం మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ ‌డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌గా రెండు విభాగాలుగా చేయడంతో పాటు ఇద్దరు కార్యదర్శులను నియమించింది. అయితే కమిషనర్/డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కే పురపాలక శాఖ కార్యదర్శి బాధ్యతలను సైతం ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను పర్యవేక్షించడంతో పాటు పురపాలక శాఖ కార్యదర్శిగాను కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమావేశాలు, సమీక్షలు, ఫైళ్లను పరిశీలించడం అదనపు భారమే. ఇదే అదునుగా భావించిన ఓ అధికారి తన విభాగంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ షాడో కమిషనర్‌గా మారారని ఆ శాఖలో అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

ఆ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే

సీడీఎంఏతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెలుపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం, టీయూఎఫ్ఐడీసీ, ఎన్ఐయూఎం, మెప్మా, మున్సిపల్ సర్వీస్ క్యాడర్ కంట్రోల్ విభాగాలకు సంబంధించిన ఫైళ్లను ఆ అధికారి చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే పురపాలకశాఖ కమిషనర్/కార్యదర్శి సంతకాలు చేస్తున్నట్టు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా బిల్లులు, అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన అంతర్గత మార్పులకు చెందిన ఫైళ్లు ఆ అధికారి దగ్గరకు రావాల్సిందే. ఇటివల టీయూఎఫ్ఐడీసీలో ఓ అధికారిని మార్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు అమ్రుత్ మిత్రలకు ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంలోనూ ఆ అధికారి పాత్ర ఉందని ప్రచారం జరుగుతున్నది.

ఆ నలుగురిలోనూ ఆయనే కీలకం

సీడీఎంఏలో నలుగురు అధికారులతో హవా నడుస్తోందని, వాళ్లు ఏం చెబితే అదే జరుగుతున్నదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీరిలోనూ ఓ అధికారి కమిషనర్ కు నమ్మినబంటుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను నడిపిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆరు విభాగాలకు సంబంధించిన ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారని చర్చించుకుంటున్నారు.

ఆరోపణలున్నా వ్యక్తి అందలం

కమిషనర్ కు పర్సనల్ అసిస్టెంట్(పీఏ) ఉన్న వ్యక్తి గతంలో టీయూఎఫ్ఐడీసీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారు. అక్కడ ఆయన తీరు బాగాలేకపోవడంతో పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిని అక్కడి నుంచి తొలగించారు. అప్పటి నుంచి తొలగించిన వ్యక్తిని ఈ షాడో కమిషనర్, మరో మున్సిపల్ కమిషనర్ కలిసి కాపాడుకుంటూ వచ్చారు. చివరగా కమిషనర్ పీఏగా నియమించారు. ఈ వ్యక్తి కేంద్రంగా షాడో కమిషనర్ చక్రం తిప్పుతున్నారని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.

‘దిశ’ ఎఫెక్ట్.. TUFIDC ఓఎస్డీపై చైర్మన్ సీరియస్

‘దిశ’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘కమీషన్ల కక్కుర్తి’ కథనంపై టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ సీరియస్ అయినట్టు తెలిసింది. పని చేసిన మహిళా సంఘాల సభ్యులకు ఏడాది నుంచి వేతనాలు ఎందుకు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో సదరు విభాగం అధికారులు అమ్రుత్ మిత్రలకు బిల్లుల చెల్లింపుపై ఫోకస్ పెట్టారు. బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కావడంతో పలువురు మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story