ప్రోటీన్ల పనితీరుపై సీసీఎంబీ సరికొత్త ఆవిష్కరణ

by Muthe.Rajitha |

ప్రోటీన్ల పనితీరుపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనుగొన్నారు.

ప్రోటీన్ల పనితీరుపై సీసీఎంబీ సరికొత్త ఆవిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రోటీన్ల పనితీరుపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనుగొన్నారు. ప్రోటీన్లు కేవలం వాటి స్థిరమైన త్రిమితీయ నిర్మాణం ద్వారానే కాకుండా, వాటికున్న అనువైన లక్షణం ద్వారా కూడా వివిధ అణువులతో బంధాన్ని ఏర్పరచుకుని అనేక విధులు నిర్వర్తిస్తాయని వారు తేల్చారు. ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, ఒకేలాంటి నిర్మాణం కలిగిన రెండు మొక్కల ప్రోటీన్లు వేర్వేరు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

ప్రోటీన్ల చలాకీ తనం కారణంగానే అది వివిధ రకాల ఆర్ఎన్ఏ అణువులతో బంధాన్ని ఏర్పరచుకోగలుగుతోంది. అంటే, ఆ ప్రోటీన్ తన ఆకారాన్ని ఎదుటి మాలిక్యూల్ యొక్క ఆకృతికి తగ్గట్టుగా తాత్కాలికంగా మార్చుకుంటుంది జీవక్రియల నియంత్రణకు ఈ స్వభావం ఎంతో ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ, అత్యాధునిక గణన పద్ధతులను ఉపయోగించి, శాస్త్రవేత్తలు కేవలం ఒక శాతం మాత్రమే ఉండే తాత్కాలిక ప్రోటీన్ నిర్మాణాలను గుర్తించారు. ఈ నిర్మాణాలు క్షణకాలం వేర్వేరు ఆకృతులను సంతరించుకుని, విభిన్న ఆర్ఎన్ఏ రూపాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కనుగొన్నారు.

ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ మందార్ వి. దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, "ఒక ప్రోటీన్ తన ఆకృతిని స్వల్పంగా మార్చుకోవడం కూడా దాని స్థిరమైన నిర్మాణం కంటే ఎంతో ముఖ్యమని నిరూపించారు. ఈ తాత్కాలిక డైనమిక్ స్థితుల ద్వారానే ప్రోటీన్లు కణంలో సంక్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగలవని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవుల్లో జన్యు నియంత్రణ సరిగ్గా జరగడానికి ఇది సహాయపడుతుందన్నారు. భవిష్యత్తులో మందుల తయారీ, పంటల లక్షణాలను మెరుగుపరచడం వంటి విప్లవాత్మక మార్పులకు ఇది దారి తీస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ ఆవిష్కరణ వైద్య, వ్యవసాయం , బయోటెక్నాలజీ రంగాల్లో కొత్త పుంతలు తొక్కడానికి అవకాశం కల్పిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story