ఎస్‌బీఐ కంప్యూటర్ ఆపరేటర్‌ అరెస్ట్.. 2002లో నమోదైన బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు

by Ramesh Naini |

కంప్యూటర్‌ ఆపరేటర్‌ చలపతిరావుకు సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.36 వేల జరిమానా విధించింది.

ఎస్‌బీఐ కంప్యూటర్ ఆపరేటర్‌ అరెస్ట్.. 2002లో నమోదైన బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: (SBI bank fraud case) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చందులాల్‌ బరాదారి బ్రాంచ్‌లో చోటుచేసుకున్న రూ.50 లక్షల బ్యాంక్‌ మోసం కేసులో నిందితుడైన కంప్యూటర్‌ ఆపరేటర్‌ చలపతిరావుకు (CBI court) సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.36 వేల జరిమానా విధించింది. ఈ విషయం సోమవారం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) హైదరాబాద్‌ శాఖ వెల్లడించింది.

సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం.. 1996-2000 మధ్య కాలంలో చలపతిరావు అప్పటి బ్రాంచ్‌ మేనేజర్‌ పి.పి. కృష్ణరావు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు, చలపతిరావు భార్య విరాజా, కలీమ్‌ పాషాలతో కలిసి తప్పుడు పత్రాల ఆధారంగా ‘బిగ్‌ బై’ లోన్లు మంజూరు చేసి, విడుదల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సుమారు రూ.50 లక్షల వరకు బ్యాంకును మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

2002లో ఈ కేసు నమోదై, 2004లో సీబీఐ మూడు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. అయితే చలపతిరావు 2005 నుంచి పరారీలో ఉన్నాడు. దాదాపు 19 ఏళ్ల పాటు పరారీలో ఉన్న అతన్ని 2024 ఆగస్టులో తమిళనాడులోని తిరునెల్వేలి ప్రాంతంలో మారుపేరుతో ఉన్నట్లు సీబీఐ గుర్తించి అరెస్ట్‌ చేసింది. తదనంతరం అక్టోబర్‌ 31న సీబీఐ కోర్టు విచారణ జరిపి, నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది.

Next Story