- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కుల’ కలకలం.. అధికార పార్టీలో రాజుకున్న ఆధిపత్య పోరు!
తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్రవర్ణ వర్సెస్ దళిత ఎమ్మెల్యేల వివాదం తీవ్రమవుతోంది. నిధులు, కేబినెట్ విస్తరణపై సొంత నేతల బహిరంగ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటడంతో ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు డోస్ పెంచుతున్నాయి. మరో రెండున్నరేళ్లు మిగిలి ఉండగానే రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్‍ను కార్నర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కలకలం రేపుతున్నాయి. ఒకటి తర్వాత మరొక సమస్య హస్తం పార్టీలో అలజడి సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు నామినేటెడ్ పదవులు, సంస్థాగత పదవుల కోసం నేతల మధ్య వివాదం నడువగా ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శలకు దిగడం చర్చనీయాశంగా మారింది. ముఖ్యంగా పార్టీ, ప్రభుత్వంలో తమను అణిచివేస్తున్నారంటూ దళిత ప్రజాప్రతినిధులు విమర్శలకు దిగడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
ఇంకెంత కాలం మీ పెత్తనం?:
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం కాకముందే తాజాగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండు రోజుల క్రితం మందుల సామేల్ మాట్లాడుతూ దళిత నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తాను టికెట్ ఇప్పిస్తే ఎమ్మెల్యే అయ్యావ్ అంటూ సామేల్‍కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే పార్టీలో, ప్రభుత్వంలో దళిత ప్రజాప్రతినిధులకు అన్యాయం జరుగుతోందంటూ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకంగా ప్రజాభవన్‍లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశం కావడం కీలక పరిణామంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేలపై అణచివేత ఒక్క మందుల సామేల్, వేముల వీరేశమో, రాగమయికి ఎదురవుతున్న సమస్య కాదని 11 ఎస్సీ నియోజకవర్గాల్లో దళిత, అగ్రవర్ణ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ఆరోపించినట్లు ప్రచారం జరుగుతోంది. అగ్రవర్ణ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని చోట్ల దళిత ఎమ్మెల్యేలం అణచివేతకు గురవుతున్నామని ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదంటూ కవ్వంపల్లి హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కంగ్రెస్ పార్టీలో దళితులు వర్సెస్ అగ్రవర్ణాల మధ్య ఏం జరుగుతోందనే చర్చతెరపైకి వస్తోంది.
నివురుగప్పిన నిప్పులా మంత్రివర్గ విస్తరణ:
దళిత ఎమ్మెల్యేల ఆవేదన ఇలా ఉండగా మరోవైపు మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి కేబినెట్ భర్తీ జరగలేదు. మంత్రి పదవి తనకు ఇవ్వాల్సిందేనని చాన్స్ దొరికిన ప్రతిసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. మిగతా ఆశావహులు సైతం తమను కేబినెట్‍లోకి తీసుకోవాలనే డిమాండ్లు ముందు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రివర్గ విస్తరణపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‍గా మారాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్లను తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే.. మంత్రులుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వారనికి కూడా తప్పించి తన లాంటి యువకులకు అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గానికి సకాలంలో నిధులు అందడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే తన నియోజకవర్గానికి నిధులు అందడం లేదని ఆరోపించడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
పార్టీ పెద్దలు చెప్పినా ఆగని వ్యాఖ్యలు:
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం పార్టీ విషయంలో ఎవరూ లైన్ దాటవద్దని ఇప్పటికే పలు సందర్భాల్లో నేతలను హెచ్చరించింది. పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించవద్దని విభేదాలు వీడాలని పీఏసీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హెచ్చరించారు. అయినా నేతలు ఇలా వివిధ కారణాలతో బజారుకెక్కడం పార్టీకి డ్యామేజ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారే అవకాశం ఉందనే ఆందోళన సొంతపార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో కుల విభేదాలు పార్టీకి తీరని దెబ్బ తీస్తాయనే వాదన వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితిపై అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా చెక్ పెడతారో అనేది ఉత్కంఠగా మారింది.






