కమలనాథుల అస్త్రంగా ‘కులగణన’..! గ్రామాల్లో విస్త్రృత ప్రచారానికి సన్నద్ధం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కమలనాథులు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

కమలనాథుల అస్త్రంగా ‘కులగణన’..! గ్రామాల్లో విస్త్రృత ప్రచారానికి సన్నద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కమలనాథులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణనకు ప్రకటన చేయడంతో పార్టీ నేతల్లో ఎనలేని ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ కులగణన ఆయుధంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి త్వరలో జరిగే పంచాయతీ, మున్సిఫల్ ఎన్నికల్లో విజయ భేరి మోగించేందుకు పార్టీ సీనియర్లు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలిసింది. కులగణనకు బీజేపీ వ్యతిరేకమనే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

బీసీ సంఘాలను తమ వైపు తిప్పుకునేందుకు వారితో మంతనాలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు, బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగేది బీజేపీతోనే అనే బలమైన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నడుం బిగించారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పధాధికారుల సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీలు లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పహెల్గాం దాడి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు అసమ్మతి నాయకులు దారిలోకి వచ్చేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలని, దేశంలో మోడీ సర్కార్ కులగణన ప్రకటనను అన్ని వర్గాలకు తెలిపేలా ప్రచారంపై శ్రేణులకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు.

ముస్లింల కోసమే కాంగ్రెస్ కులగణన

ఇటీవల తెలంగాణలో జరిగిన కులగణన సర్వేలో కుట్రపూరితంగా బీసీల జనాభా తగ్గించేందుకు రేవంత్ సర్కార్ యత్నించిందని, ముస్లింలను బీసీ జనాభాలో కలిపి స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా మోసం చేసేందని ప్రచారం చేసేందుకు బీజేపీ శ్రేణులు రెడీ అవుతున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమనే విషయాన్ని ఊరురా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో అదే లెగసీని కంటిన్యూ చేసేందుకు ఇదే సరైన సమయమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

పహెల్గాం దాడిపై కలెక్టర్లకు వినతి పత్రాలు

కశ్మీర్లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కమళనాథులు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. దాయాది పాక్తిసాన్ కుట్రలను బహిర్గతం చేసి, దాడి వెనక ఉన్న రహస్యాన్ని బయటకు తీసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నంలో ఉందని ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ దాడిని కొన్ని పార్టీలు రాజకీయం చేసేందుకు ఎత్తగడలు వేస్తున్నాయని వాటిని తిప్పికొట్టి బీజేపీతోనే దేశానికి రక్షణ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు.

Next Story