రూ.64 లక్షలు ముట్టినాక ప్లేట్ మార్చిన ‘విజయ్ జేబీ ఇన్ఫ్రా’.. ‘రియల్’ మోసంతో ఖంగుతిన్న కస్టమర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-28 12:41:50  IST  )

అందమైన బ్రోచర్లను ఏర్పాటు చేస్తూ కస్టమర్లకు ప్లాట్లను అమ్ముతున్న విజయ్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్(టెర్రా గ్రీన్ హిల్స్)పై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

రూ.64 లక్షలు ముట్టినాక ప్లేట్ మార్చిన ‘విజయ్ జేబీ ఇన్ఫ్రా’.. ‘రియల్’ మోసంతో ఖంగుతిన్న కస్టమర్
X

దిశ, చౌటుప్పల్: అందమైన బ్రోచర్లను ఏర్పాటు చేస్తూ కస్టమర్లకు ప్లాట్లను అమ్ముతున్న విజయ్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్(టెర్రా గ్రీన్ హిల్స్)పై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టి అమ్మకాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇటీవల విజయ్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్(టెర్రా గ్రీన్ హిల్స్) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో మేకల రఘుమా రెడ్డి అనే వ్యక్తి నాలుగు ప్లాట్లను బుక్ చేసుకున్నారు. అందుకు కొంత అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు కంపెనీ అగ్రిమెంట్ కూడా చేసింది. రూ.64 లక్షలు చెక్‌ల రూపంలో అడ్వాన్స్‌గా చెల్లించగా.. అతనికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వివిధ అకౌంట్లో జమ చేయడంతో చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఎలాంటి అనుమతులు లేని వెంచర్ అని తెలియడంతో తాను అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని అడిగాడు. అసలు తనకు డబ్బులే చెల్లించలేదని వెంచర్ యజమాన్యం చెప్పడంతో ఆయన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కస్టమర్ మోసపోయినట్లేనా?

చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట రెవెన్యూ పరిధిలో 222 ఎకరాలలో మెగా వెంచర్‌ను విజయ్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంస్థ టెర్ర గ్రీన్ హిల్స్ పేరుతో ప్రారంభించింది. భారీ హోర్డింగ్‌లతో ప్రకటనలు ఇస్తూ కస్టమర్లను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం చేస్తుంది. భారీగా వస్తున్న ప్రకటనలతో ఈ వెంచర్‌లో ప్లాట్లను కొనేందుకు అడ్వాన్సులు కూడా చెల్లించారు. అయితే ఇందులో భాగంగా మేకల రఘుమా రెడ్డి అనే వ్యక్తి ప్లాట్ నెంబర్ సదరు మెగా లేఅవుట్లలో ప్లాట్ నెంబర్ 325, 326, 327,328 లను కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరి 2వతేదీన టెర్ర గ్రీన్ హిల్స్ ప్రతినిధి సీహెచ్ విజయ్ కుమార్, రఘుమా రెడ్డికి కొనుగోలు ఒప్పందాన్ని చేశాడు. ఇందుకు గాను అడ్వాన్స్‌గా 25 శాతం పేమెంట్ చేసినట్లు సదరు అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు.

మిగిలిన మొత్తాన్ని 15 రోజులలో చెల్లించేందుకు కూడా అంగీకారం కుదిరింది. అదే విధంగా రఘుమా రెడ్డి అనే వ్యక్తి తన ఖాళీ చెక్కులపై రూ. 64 లక్షల అమౌంట్ వేసి సంతకం పెట్టి సదరు యాజమాన్యానికి అందించారు. మొదట చెల్లించిన 64 లక్షల రూపాయలకు రసీదు ఇవ్వమని రఘుమారెడ్డి అడగగా సేల్ అగ్రిమెంట్‌లో పేర్కొన్నాక రసీదు అవసరం లేదని యాజమాన్యం తెలిపింది. సరే అనుకున్న రఘుమా రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రెండు 16 లక్షల రూపాయల చెక్కులను టెర్ర గ్రీన్ హిల్స్ అకౌంట్లో వేయగా మరో రెండు చెక్కులను దేవి గార్మెంట్స్ అకౌంట్లో వేశారు. దీంతో తనకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు ఎందుకు వేశారని రఘుమా రెడ్డి అనే వ్యక్తి పేమెంట్లు స్టాప్ చేసినట్లు తెలిపారు.

అనుమతులు లేవని తెలిసి నివ్వెరపోయిన కస్టమర్

తూప్రాన్ పెట్ రెవెన్యూ పరిధిలో విజయ్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని తెలుసుకుని కస్టమర్ రఘుమారెడ్డి నివ్వెరపోయాడు. దీంతో సదరు కస్టమర్ తాను ఇప్పటికే చెల్లించిన 64 లక్షల రూపాయలను తిరిగి తనకు చెల్లించాలని విజయ్ జేబి ఇన్ఫ్రా గ్రూప్‌ను కోరారు. మొత్తం నాలుగు పాట్లు 1068 గజాలకు గాను రెండు కోట్ల 54 లక్షల 98,500 రూపాయలు కాగా.. 16 లక్షల రెండు వేల రూపాయలను డిస్కౌంట్‌గా ఇచ్చారు. ఈ నాలుగు ప్లాట్ల ఖరీదు రెండు కోట్ల 38 లక్షల 96,500 కాగా.. అడ్వాన్స్‌గా 64 లక్షలు ముందుగానే చెల్లించాడు. దీంతో తిరిగి తన డబ్బులు తనకు ఇవ్వాలని రఘుమా రెడ్డి కోరాడు. దీనికి యాజమాన్యం నిరాకరించడంతో ఫిబ్రవరి 14న రఘుమారెడ్డి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ 316(2),318(4) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

బ్లాక్ మనీని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు?

- ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా జాతీయ రహదారి వెంట భారీ హోర్డింగ్‌లు పెట్టి ప్రకటనలు ఇస్తున్న జేబీ ఇన్ఫ్రా గ్రూప్ యాజమాన్యం వెంచర్లో ప్లాట్లను అమ్మకాలు చేసినప్పుడు వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీనే ప్రోత్సహిస్తున్నట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. సదరు కంపెనీ యాజమాన్యం బ్లాక్ మనీ తీసుకునేందుకే ఇష్టపడుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నప్పుడు బ్లాక్ మనీ అడగడం పట్ల యాజమాన్యంపై అతనికి అనుమానం కలిగింది. దీంతో జరిగిన సంఘటనపై రఘుమా రెడ్డి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు వెంచర్‌పై కేసు నమోదు చేశారు.

న్యాయం చేయండి: ఎం.రఘుమా రెడ్డి, కస్టమర్ విజయ్ జేబి ఇన్ఫ్రా (టెర్ర గ్రీన్ హిల్స్)

- తూప్రాన్ పెట్ రెవెన్యూ పరిధిలోని టెర్ర గ్రీన్ హిల్స్‌లో నాలుగు పాట్లు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాను. 64 లక్షల రూపాయల డబ్బులు ముందుగా చెల్లించాను. భారీ ప్రకటనలను చూసి అడ్వాన్స్ చెల్లించాక వెంచర్ గురించి ఆరా తీయగా అనుమతులు లేవని తెలిసింది. తాను చెల్లించిన 64 లక్షలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితుల్లో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. విచారణ జరిపి తగు న్యాయం చేయాలి.

Next Story