Modi Cartoon: మోడీపై అభ్యంతరకర కార్టూన్.. తమిళ్ వెబ్ సైట్ బ్లాక్!.. అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |   (  Updated:2025-02-16 11:50:09  IST  )

ప్రధాని మోడీపై వేసిన ఓ కార్టూన్ తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నది.

Modi Cartoon: మోడీపై అభ్యంతరకర కార్టూన్.. తమిళ్ వెబ్ సైట్ బ్లాక్!.. అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అమెరికా, ఇండియా మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా విషయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మౌనం వహించారని అర్థం వచ్చేలా ఓ తమిళ వెబ్ సైట్ కార్టూన్ (Cartoon) ప్రచురించగా తాజాగా ఆ వెబ్ సైట్ బ్లాక్ చేశారనే చర్చ తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. వికటన్ (Vikatan) అనే డిజిటల్ మ్యాగజైన్ భారతీయులను అమెరికా నుండి చేతులు కట్టి బహిష్కరిస్తుంటే ప్రధాని మోడీ మౌనం వహించారని అర్థం వచ్చేలా ట్రంప్ ముందు నరేంద్ర మోడీ చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసినట్లుగా ఉన్న కార్టూన్ ను ఇవాళ తేదీన ప్రచురించింది. అయితే ఈ కార్టూన్ ప్రచురించాక వికటన్ వెబ్ సైట్ కేంద్ర ప్రభుత్వం వెబ్ సైట్ ను బ్లా క్ చేసిందని పేర్కొంటు పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వికటన్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది వినియోగదారులు తమకు నివేదించారని అయితే ఇప్పటి వరకు, వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన మాకు రాలేదని వికటన్ టీమ్ పేర్కొంది.

పొలిటికల్ దుమారం:

ఈ కార్టున్ అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఫిబ్రవరి 15న కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్‌కు లేఖ రాశారు. వికటన్ మ్యాగజైన్ లో ప్రచురించిన "ప్రధానమంత్రి మోడీని పరువు తీయడానికి ఉద్దేశించిన ముఖచిత్రం"పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ మ్యాగజైన్ కు అధికార డీఎంకే నుంచి మద్దతు లభించింది. ఈ వెబ్‌సైట్ బ్లాక్ చేయడాన్ని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (M K Stalin), రాజకీయ పార్టీల నాయకులు ఖండించారు. మీడియాను తమ అభిప్రాయాల కోసం అడ్డుకోవడం ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధమని, దానిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. బీజేపీ ఫాసిస్టు స్వభావానికి ఇదో ఉదాహరణ అని వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై కూడా కేంద్రం చర్యను ఖండించారు. ఈ చర్య భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని టీవీకే చీఫ్ విజయ్ విమర్శించారు. ఇక సీఎం స్టాలిన్ తీరుపై తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛ యొక్క భావనను ముఖ్యమంత్రి ఇప్పటికి అర్థం చేసుకున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గత నాలుగేళ్లలో అరెస్టు చేసిన వ్యక్తుల జాబితాను చదివిన తర్వాత దయచేసి భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడాలి" అంటూ సెటైర్ వేశారు. ఈ వ్యవహారంపై డీఎంకే ఎంపీ కనిమొళి ఎక్స్ వేదికగా స్పందిస్తూ భావస్వేచ్ఛ ప్రకటనను అడ్డుకోవడమేనని విమర్శించారు.

Next Story