Eatala Rajender: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేయాలి: ఈటల

by Prasad Jukanti |   (  Updated:2025-07-12 10:02:09  IST  )

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం పిల్లనివ్వడం లేదని ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender:  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేయాలి: ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: పర్మినెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా కమిటీలు వేశారో ఆదే రకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పర్మినెంట్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంతే మంది ఉన్నారని.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేయకపోతే కొన్ని శాఖలు పూర్తిగా పని చేయని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇవాళ ఇందిరాపార్క్ దర్నాచౌక్ లో చేపట్టిన తెలంగాణ ఔట్ సోర్స్ ఉద్యోగుల మహా ధర్నాకు ఈటల సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సర్వీస్ సెక్టార్ కు జీఎస్టీ అన్యాయం:

తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసమే ఇవాళ ఇవాళ ఔట్ సోర్సింగ్ (Eatala Rajender) ఉద్యోగులు రోడెక్కారని వీరికి ఈపీఎఫ్, పీఎఫ్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు సర్వీస్ సెక్టార్ కింద వస్తాయని సర్వీస్ సెక్టార్ కింద పని చేసే ఉద్యోగులకు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం అన్యాయం అన్నారు. ప్రైవేట్ సెక్టార్ విషయం ఎలా ఉన్నా ప్రభుత్వ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్ ఎజెన్సీ జీఎస్టీ రద్దుకు పార్టీలకు అతీతంగా కృషి చేస్తానన్నారు. ఈ జీఎస్టీ విషయంలో తప్పకుండా ప్రస్తావిస్తానని నేను ఏ పార్టీలో ఉన్నాననే అంశంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నూటికి నూరు శాతం ఏజెన్సీల వ్యవస్థ పోవాలని దీనిపై తాను గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే నేను ఈ ప్రతిపాదన పెట్టానని కానీ మధ్యలో ఈ కథ ఏందని తేసేయించారని చెప్పారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఏ రకంగా మొదటి వారంలో జీతాలు వస్తున్నాయో ఆ రకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, రెన్యువల్స్ ఆటోమెటిక్ గా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

పిల్లనివ్వడం లేదు:

సోర్సింగ్ ఉద్యోగులలో చాలా మంది 20 ఏళ్లకు పైగా ఆయా శాఖలలో పని చేస్తున్నారని వారిని పర్మినెంట్ ఉద్యోగులు వచ్చారనే కారణంతో ఉద్యోగాలలో నుంచి తీసేస్తే వారంతా ఇంటిబాట పట్టడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. వీళ్లకు వేతనంతో కూడిన సెలవులు, పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు లేవని పెళ్లి చేసుకుందామంటే పిల్లను ఇచ్చే పరిస్థితి లేదని ఈటల అన్నారు. ఓ వైపు కుటుంబం పోషణకు భారం పెరిగిపోతుంటే మరో వైపు కొన్ని శాఖలు మాత్రం గ్రాండ్ ఇస్తే తప్ప ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సమయపాలన లేదని ఆఫీసులలోని చిన్న స్థాయి నుంచిపై స్థాయి పర్మినెంట్ ఉద్యోగులందరికీ వీరి పట్ల చిన్నచూపు ఉంటోందని వాళ్లు చేయాల్సిన పనులు కూడా వీళ్లచేతనే చేయిస్తున్నారన్నారు. ఇవాళ తాపీ మేస్త్రీకి రోజుకు రూ .1500, పారకాడికి రూ. 1200 కూలి ఉంటే పీహెచ్ డీ చదివిన వారికి రూ. 1500 జీతం ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి శ్రమశక్తిని తాను కించపరచడం లేదన్నారు.

Next Story