మీటింగ్‌కు డుమ్మా.. ఇద్దరూ ఐఏఎస్ లపై కేబినెట్ సబ్‌కమిటీ సీరియస్

by Malleboina Mahesh |

రిసోర్స్ మొబిలైజేషన్ మీటింగ్‌కు రాని ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్, సర్ఫరాజ్ అహ్మద్‌లపై కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీటింగ్‌కు డుమ్మా.. ఇద్దరూ ఐఏఎస్ లపై కేబినెట్ సబ్‌కమిటీ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అదనపు ఆదాయ వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకపోవడంపై ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లపై రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్‌కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కీలకమైన మీటింగ్ కి డుమ్మా కొట్టడంపై మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తీరుపై మండిపడినట్లు సమాచారం. సమావేశానికి రాకుండా ఇతర పనుల్లో ఉండటం ఏంటీ? అని ప్రశ్నించినట్లు తెలిసింది.

ఇద్దరి తీరుపై సీరియస్

అదనపు ఆదాయ వనరులను సమీకరించేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆదాయాన్ని సమకూర్చే శాఖల అధికారులతో ప్రతి శుక్రవారం సమావేశమై, అంతకు ముందు వారం తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షిస్తున్నది. అయితే, ఈనెల 22న సెక్రెటేరియట్‌లో జరిగిన మీటింగ్‌కు మున్సిపల్ శాఖకు చెందిన అంశాలపైనే ఎక్కువగా సమీక్ష చేయాలని కమిటీ భావించినట్లు తెలిసింది. ఆ సమావేశానికి మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అటెండ్ కాలేదు.

దీంతో మంత్రులు ఆ ఇద్దరు అధికారుల తీరుపై సీరియస్‌గా రెస్పాండ్ అయినట్లు తెలిసింది. ‘ఆ ఇద్దరు అధికారులు ఎందుకు రాలేదు. ఎవరి పర్మిషన్ తీసుకుని గైర్హాజరయ్యారు. ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే కుదరదు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా మీటింగ్‌కు కచ్చితంగా రావాలి. ఒకవేళ నేరుగా అటెండ్ కాలేదు పరిస్థితి ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా అటెండ్ కావాలి’ అని కేబినెట్ సబ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతున్నది.

Next Story