అధికారులపై కేబినెట్ సబ్ కమిటీ నారాజ్.. పనిపై ఫోకస్ పెట్టాలని హితవు

by Kema Shiva Kumar |

అదనపు ఆదాయం సమకూర్చడంలో సీరియస్ నెస్ కనిపించడం లేదు.

అధికారులపై కేబినెట్ సబ్ కమిటీ నారాజ్.. పనిపై ఫోకస్ పెట్టాలని హితవు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అదనపు ఆదాయం సమకూర్చడంలో సీరియస్‌నెస్ కనిపించడం లేదు. ప్రతి మీటింగ్‌లో అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పడం తప్పా ప్రోగ్రెస్ ఎక్కడ? ఆఫీసర్లు సరిగా పని చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి’ అని వివిధ శాఖల అధికారులపై కేబినెట్ సబ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ‘రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ’ భేటీ జరిగింది. ఈ సమావేశంలో శాఖల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ పరిశీలించారు. కేవలం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మినహా మిగతా శాఖల పనితీరు సరిగా లేదని గుర్తించారు. అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావడం లేదని కేబినెట్ సబ్ కమిటీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కనిపించని పురోగతి

కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రెవెన్యూ, మైనింగ్, ఇండస్ట్రీ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్టు శాఖల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ శాఖల్లో క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా ఆదాయానికి గండిపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అదనపు ఆదాయం సమకూర్చడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ఐదారు సార్లు సమావేశమైంది. కానీ అదనపు ఆదాయం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రులు చెప్పడం తప్పా, పనితీరులో పురోగతి లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన సమావేశంలో మంత్రులు అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. గత సమావేశంలో చదివి వినిపించిన రిపోర్టులను అధికారులు మళ్లీ చదివి వినిపిస్తున్నారే తప్పా, కొత్త అంశాలు చెప్పడం లేదని పెదవి విరిచినట్లు సమాచారం. అయితే అదనపు ఆదాయం సమకూర్చే విషయంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సక్సెస్ అయిందని ఆ శాఖ ఆఫీసర్లకు కితాబిచ్చినట్లు తెలిసింది.

లీకేజీలను అరికట్టడంలో ఫెయిల్

క్షేత్ర స్థాయిలో జరుగుతున్న లీకేజీలను అరికట్టడంలో వివిధ శాఖల అధికారులు ఫెయిల్ అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో అదనపు ఆదాయం సమకూర్చే అవకాశాలున్నా.. అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నాన్ పెయిడ్ లిక్కర్ లభ్యమవుతున్నా.. ఆఫీసర్లు అరికట్టడం లేదని ఆరోపణలున్నాయి. కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా.. వాటిని అరికట్టలేకపోతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. హౌజింగ్ శాఖలోని రాజీవ్ స్వగృహ ప్లాట్స్ ను విక్రయించడంలో అధికారులు చొరవ చూపట్లేదని తెలుస్తున్నది. ప్రస్తుత మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు ఆ పాట్లను అమ్మకానికి పెడితే.. ప్రభుత్వానికి వెంటనే అదనపు ఆదాయం వచ్చే చాన్స్ ఉంది.

Next Story