చిచ్చురేపుతున్న ‘కేబినెట్ హోదా’.. మరి జీతాల్లోనే ఎందుకు తేడాలు?

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-14 11:41:06  IST  )

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల మధ్య జీతభత్యాలు, ప్రోటోకాల్‌పై అసంతృప్తి నెలకొంది.

చిచ్చురేపుతున్న ‘కేబినెట్ హోదా’.. మరి జీతాల్లోనే ఎందుకు తేడాలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ప్రభుత్వానికి,వివిధ శాఖలకు 11 మంది సలహాదారులు ఉన్నారు. కాని ఒక్కొక్కరి జీతం ఒక్కో రకంగా ఉంది. దీనిపై తక్కువ జీతం ఉన్న అడ్వయిజరీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరం సలహాదారులమే కదా?కొందరికి ఎక్కువ జీతం, ఇంకొందరికి తక్కువ జీతం ఎందుకు? వారికి మంత్రులతో సమానంగా ప్రొటోకాల్ ఇవ్వడం, మాకు మాత్రం తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేయడం ఏంటీ?అని ఆవేధన చెందుతున్నారు. సలహాదారులు అందరికి ఒకేరకమైన జీతభత్యాలు,ప్రొటోకాల్ ఇవ్వాలంటూ సన్నిహితంగా ఉండే మంత్రులను డిమాండ్ చేస్తున్నారు.

వారికే ఎందుకు ప్రయారిటీ?

ప్రభుత్వం సలహాదారులు అందరిని ఒకే తీరుగా ట్రీట్ చేయకుండా,కొందరికి ప్రయారిటీ ఇచ్చి,మిగతా వారిపట్ల వివక్ష చూపడం ఏంటీ?అని తక్కువ జీత భత్యాలు అందుకుంటున్న సలహాదారులు ఆవేధన చెందుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడిన తమకు ప్రయారిటీ ఇవ్వకపోవడం బాధగా ఉందంటూ సన్నిహితంగా ఉండే మంత్రుల వద్ద మనస్సులోని బాధను చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీలో ఉండి,అధికారం వచ్చిన తరువాత పార్టీలో చేరిన లీడర్లకు,కొందరు రిటైర్డ్ అధికారులకు సలహాదారు పదవులు ఇవ్వడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సలహాదారుల్లో కూడా ఓసీ వర్గాలకు చెందిన లీడర్లకు పెద్ద పదవులు ఇచ్చి, మిగతా వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వడం లేదని గుర్తు చేసినట్లు తెలిసింది. “ఓసీ వర్గానికి చెందిన అడ్వయిజరీకి మంత్రి తో పాటు సమాన జీతం,ప్రొటోకాల్, మాకు మాత్రం లక్షన్నరలోపు జీతం ఇస్తారా?ఇదేం న్యాయం?’’అని ఓ అడ్వయిజర్ తన ఆవేధనను ఓ సీనియర్ మంత్రి వద్ద వెలిబుచ్చినట్లు తెలిసింది.

ఇద్దరికి మాత్రమే కేబినెట్ హోదా

కే.కేశవరావు(పబ్లిక్ ఎఫైర్స్),పీ.సుదర్శన్ రెడ్డి(ప్లాగ్ షిఫ్,వెల్ఫేర్ పథకాల అమలు)కు మాత్రమే కేబినెట్ హోదా ఇచ్చారు. వీరికి మంత్రులతో పాటు సమానంగా జీతభత్యాలు,ప్రోటోకాల్ సౌకర్యం ఉంటుంది. ఆ ఇద్దరికి కేటాయించిన సబ్జెక్టులపై చర్చలు,నిర్ణయాలు జరిగే సమయంలో సీఎం వద్ద రివ్యూలకు, కేబినెట్ సమావేశానికి సైతం ఆహ్వానిస్తుంటారు. వీరిద్దకి అంతగా ప్రయారిటీ ఇవ్వడం వెనుక పలు రాజకీయ కారణాలు ఉన్నాయి. కేకే బీఆర్ఎస్ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి,కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమార్తే హైదరాబాద్ మేయర్ హోదాలో గద్వాల విజయలక్ష్మి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.దీనితో ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సామాజిక సమీకరణల కారణంగా మంత్రి పదవి ఇవ్వనందకు ప్రత్యామ్నయంగా కేబినెట్ హోదాతో కూడిన సలహాదారుడు పదవి ఇచ్చారు.

నియామకంపై విమర్శలు సైతం

బీఆర్ఎస్ హాయంలో సలహాదారుల నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇప్పుడు మాత్రం సలహాదారలను దఫా దఫాలుగా నియమిస్తుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా వివిధ శాఖలకు అడ్వయిజరీలను నియమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సన్నిహితులైన రిటైర్డ్ అధికారులను వివిధ శాఖల్లో సలహాదారులుగా నియమించడం వల్ల ఆశాఖల్లో పనిచేస్తోన్న సీనియర్ అధికారులకు స్వేచ్చ లేకుండా పోతుందని, ఇది పరోక్షంగా ఉపాధి పునరావసంగా మారిందని చర్చ జరుగుతున్నది.


Next Story