- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ‘ఆర్డీఎస్ఎస్’ పథకానికి ఆమోద ముద్ర!
తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ (రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పథకంలో చేరేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందులో వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు ఇవ్వగా.. మిగిలిన అన్ని కేటగిరీలకు దశలవారీగా ఈ అధునాతన మీటర్లు అమర్చనున్నారు.
నష్టాలను తగ్గించేందుకే..
విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను తగ్గించడం, పారదర్శక బిల్లింగ్ వ్యవస్థను తీసుకురావడం, సాంకేతిక ఆధునీకరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పటికీ, ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్మార్ట్ మీటర్ల కొనుగోలు, ఏర్పాటు కోసం అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని, దీంతో వినియోగదారులపై అదనపు భారం పడదని అధికారులు చెబుతున్నారు.
స్మార్ట్ మీటర్ అంటే?
స్మార్ట్ మీటర్ అనేది సాధారణ మీటర్ కంటే అధునాతన డిజిటల్ పరికరం. ఇందులో ప్రత్యేక కమ్యూనికేషన్ లేదా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) మాడ్యూల్ అమర్చి ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) సర్వర్లకు పంపిస్తుంది. మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుతుంది. దీంతో ప్రతి నెల ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. డిస్కంల కేంద్ర సర్వర్ ద్వారానే ఆటోమేటిక్‌గా రీడింగ్ నమోదవుతుంది. దీంతో రీడింగ్ నమోదు తప్పిదాల వల్ల భారీ విద్యుత్ బిల్లులు వచ్చే ప్రమాదం, మానవ తప్పిదాలకు ఆస్కారం తగ్గుతుంది. వినియోగించిన విద్యుత్‌కు అనుగుణంగానే బిల్లు రూపొందే అవకాశం ఉంటుంది.
మొబైల్‌లోనే వివరాలు..
స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రోజువారీ విద్యుత్ వినియోగాన్ని పరిశీలించుకునే వీలుంటుంది. దీంతో ఇంట్లో అధిక విద్యుత్ వినియోగం ఎక్కడ జరుగుతోందో గుర్తించి.. అవసరానికి తగ్గట్టు వినియోగాన్ని నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల విద్యుత్ వినియోగం కూడా డిజిటల్ పర్యవేక్షణలోకి రానుంది. దీంతో బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతోపాటు బకాయిల నియంత్రణకు కూడా దోహదపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఎంత లోడ్ వినియోగం జరుగుతోందో కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రావడంతో.. లో-వోల్టేజ్ సమస్యలు, అకస్మాత్తు అంతరాయాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే విద్యుత్ దొంగతనాలు, లైన్ లాసెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో వేగంగా గుర్తించే వీలుంటుంది.
భవిష్యత్తులో ప్రీపెయిడ్ విధానమా?
ప్రస్తుతం ఈ స్మార్ట్ మీటర్లను సాధారణ పోస్ట్ పెయిడ్ విధానంలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వినియోగదారులు నెలాఖరులో బిల్లు చెల్లించే విధానం కొనసాగుతుంది. అయితే భవిష్యత్తులో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, బకాయిల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని.. మొబైల్ రీచార్జ్ తరహాలో ముందుగానే చెల్లింపులు చేసే ప్రీపెయిడ్ విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది.






