కులాల పేర్లలో తిట్టు పదాలకు చెక్.. బీసీ కమిషన్ సిఫారసులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

by Ramesh Naini |

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తిట్టు పదాలుగా ఉన్న పలు కులాల పేర్ల మార్పులపై చేసిన సూచనలను, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీడ్ తదితర పథకాలకు అర్హులైన సంచార జాతుల జాబితాలపైన రాష్ట్ర మంత్రివర్గానికి తాము చేసిన సిఫార్సులను ఆమోదించడం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది.

కులాల పేర్లలో తిట్టు పదాలకు చెక్.. బీసీ కమిషన్ సిఫారసులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తిట్టు పదాలుగా ఉన్న పలు కులాల పేర్ల మార్పులపై చేసిన సూచనలను, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీడ్ తదితర పథకాలకు అర్హులైన సంచార జాతుల జాబితాలపైన రాష్ట్ర మంత్రివర్గానికి తాము చేసిన సిఫార్సులను ఆమోదించడం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు సోమవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ 2024 అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, బీసీల స్థితిగతుల అధ్యయనం కోసం బహిరంగ విచారణను చేపట్టిందని, ఈ సందర్భంగా పలు అంశాలు కమిషన్ దృష్టికి రాగా అందులో ప్రధానంగా సమాజంలో తమ కులం పేర్ల ద్వారా అవమానాలకు గురవుతున్న కొన్ని కులాలు తమ కులాల పేర్లను మార్చవలసిందిగా కమిషన్‌ను అభ్యర్థించడం జరిగిందని నిరంజన్ తెలిపారు. ఆ అభ్యర్థనలను కూలంకషంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వారి స్థితిగతులను అధ్యయనం చేశామని, ఆయా కులాలు కోరిన పేరు మార్పులపై పత్రికా ప్రకటన ద్వారా అభ్యంతరాలను ఆహ్వానించి పరిశీలించామన్నారు. సమగ్ర అధ్యాయనం తర్వాత బీసీ జాబితాలో 1) దొమ్మర కులం పేరును ‘గడవంశీయ’గా మార్చాలని 2) బీసీ జాబితాలో పిచ్చిగుంట్ల పదాన్ని తొలగించి ‘వంశరాజ్​’ను మాత్రమే కొనసాగించాలని 3) బీసీ జాబితాలో తమ్మలి కులంతో పాటుగా అవమానకరంగా ఉన్న ‘శూద్ర కులం’ పదాలను తొలగించాలని 4) బీసీ జాబితాలో బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ అనే పదాన్ని జోడించి, బుడబుక్కల కులం పేరును అవమానకరంగా భావించేవారు శివ క్షత్రియ పేరుతో వ్యవహరించబడేలా 5) బీసీ జాబితాలో చాకలి కులానికి ‘ధోబి’ అనే పర్యాయపదాన్ని చేర్చాలని 6) మేర కులానికి ‘మేరు’ అనే పర్యాయపదాన్ని చేర్చాలని 7) వీరభద్రీయ కులం పేరును ప్రధానంగా ప్రస్తావిస్తూ, దాని అనుబంధ కులాలైన వీరముష్టి, నెత్తి కోతల క్రమాన్ని బీసీ జాబితాలో మార్చాలని బీసీ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిందని నిరంజన్ వెల్లడించారు.

డీఎన్టీల (విముక్త జాతులు, సంచార, అర్థ సంచార కులాలు) కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీడ్ పథకం కోసం అర్హులైన సంచార జాబితాను నోటిఫై చేసి, వారికి సర్టిఫికెట్లు జారీ చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డీఎన్టీ బోర్డు కోరిన తర్వాత బీసీ కమిషన్ ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి తమ సిఫారసులను ప్రభుత్వానికి అందజేశామని నిరంజన్ తెలిపారు. బీసీ కమిషన్ తమ సమగ్ర అధ్యయనం ద్వారా బీసీ–ఏ గ్రూప్‌లోని 49 కులాలను, ఇ‌–గ్రూపులోని 2 కులాలను సంచారజాతులుగా గుర్తించిందన్నారు. వీరికి సంచార జాతులుగా ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి ప్రస్తుతం జారీ చేస్తున్న కుల ధృవీకరణ పత్ర నమూనాలో అవసరమైన మార్పులను కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిందని, ఈ సర్టిఫికేట్ల దుర్వినియోగాన్ని నివారించడానికి రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలని కమిషన్ సూచించిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో సీడ్ పథకం అమలును పర్యవేక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం, డీఎన్టీ బోర్డుతో సంప్రదింపులు జరిపేందుకు, అర్హులైన లబ్ధిదారులు పథకాన్ని అందుకోవడంలో సహాయ సహకారాలు అందిచేందుకు రాష్ట్రస్థాయిలో ఎంబీసీ కార్పొరేషన్ లేదా ఏదైనా ఇతర సంస్థను అనుసంధానకర్తగా నియమించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేశామన్నారు. రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన సంచార జాతుల జాబితా కలిగి ఉండటం వలన భవిష్యత్‌లో అనేక ప్రయోజనాలు ఉండనున్నాయని, వీరికోసమే ప్రత్యేకంగా రూపొందించబడ్డ పలు పథకాల ద్వారా వీరు లబ్ధి పొందనున్నట్లుగా నిరంజన్ చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో వీరి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేకమైన పథకాలు రూపొందించడానికి వీలవుతుందని, ఇటీవల జరిగిన కుల సర్వే ప్రకారం రాష్ట్రంలో వీరి జనాభా దాదాపు 18,94,966 గా ఉందన్నారు.

Next Story