కేబినెట్ విస్తరణ చిచ్చు.. గాంధీభవన్‌కు అసంతృప్తుల తాకిడి

by Kema Shiva Kumar |

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో ఆశావహులు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.

కేబినెట్ విస్తరణ చిచ్చు.. గాంధీభవన్‌కు అసంతృప్తుల తాకిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో ఆశావహులు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. మొన్నటిదాకా కేబినెట్‌లో బెర్తు ఖాయమని భావించిన కొన్ని సామాజిక వర్గాల నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో వారు ఒక్కొక్కరుగా గాంధీభవన్ మెట్లెక్కుతున్నారు. ఒక దశలో ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు బుధవారం గాంధీభవన్ వద్ద ఆందోళన చేయాలని సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో వారికి పీసీసీ చీఫ్ నచ్చజెప్పడంతో సైలెంట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ అనుచరులు భారీగా గాంధీభవన్‌కు తరలిరావడం చర్చనీయాంశంగా మారింది.

ఆది శ్రీనివాస్ తరఫున..

రాష్ట్ర మంత్రి వర్గంలో మున్నూరు కాపు ఎమ్మెల్యేకు చోటు కల్పించాలని ఆ కుల సంఘం నేతలు కోరుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు తెలంగాణలోని మున్నూరు కాపు రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులు, 33 జిల్లాల అధ్యక్షులు గురువారం గాంధీభవన్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి చదలు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వర్‌రావులు మీడియాతో మాట్లాడారు. మంత్రి మండలిలో కానీ, కార్పొరేషన్ పదవుల్లో కానీ ఇంతవరకు మున్నూరు కాపులకు న్యాయం జరగలేదన్నారు. మున్నూరు కాపు నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంత్రి మండలిలో స్థానం కల్పించాలని కోరారు. అలాగే, మున్నూరు కులానికి కార్పొరేషన్ పదవులు ఇప్పించాలని కోరారు.

డిప్యూటీ సీఎంతో బీర్ల ఐలయ్య భేటీ

ఇదిలా ఉండగా ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీసీలకు న్యాయం జరిగినా.. గొల్ల కురుమలకు అన్యాయం జరిగిందని స్వయంగా విప్​బీర్ల ఐలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గొల్ల, కురుమ సంఘం నాయకులతో కలిసి గాంధీభవన్‌కు చేరుకొని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్‌ను ప్రత్యేకంగా కలిశారు. అలాగే ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ గొల్ల, కురుమ సామాజికవర్గానికి చెందిన ఒకరు కేబినెట్‌లో మంత్రిగా ఉండేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో యాదవులు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది వరకు ఉన్నారని తెలిపారు. గొల్ల, కురుమలకు మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారుడు, ఒక ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు, ఐదు కమిషన్ సభ్యులు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్స్, 8 జనరల్ సెక్రటరీలు, ఐదు డీసీసీ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఏదేమైనా బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నప్పటికీ తమ కులాలకు సరైన న్యాయం జరగలేదన్న అసంతృప్తిని నేతలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అధిష్టానం తమకు న్యాయం చేయని పక్షంలో ఏ రకంగా వ్యవహరించాలన్న ఆలోచనలు ఆయా నేతలు, అనుచరులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story