Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై చిగురించిన ఆశలు.. నేడు ఆ భేటీలో లిస్ట్ ఫైనల్?

by Kema Shiva Kumar |

కేబినెట్ విస్తరణపై ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై చిగురించిన ఆశలు.. నేడు ఆ భేటీలో లిస్ట్ ఫైనల్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేబినెట్ విస్తరణపై ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మళ్లీ ఊహగానాలు మొదలయ్యాయి. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చనే ప్రచారం ఊపందుకున్నది. గురువారం సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, లీడర్ల మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం రాహుల్ గాంధీ, ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, లోకల్ పోల్స్, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు.

రాహుల్ భేటీలో నిర్ణయం!

చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. ఈసారి విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక ఎప్పటిలాగే వాయిదా పడుతుందా? అనే చర్చ జరుగుతున్నది. సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను తయారు చేసినట్లు తెలుస్తున్నది. అయితే రాహుల్‌గాంధీ వద్ద జరిగే సమావేశంలో కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విస్తరణ ఇప్పుడే చేయాలా? కొంత కాలం తర్వాత చేపట్టాలా? అని ఆయన దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా రాహుల్ వద్ద ఆశావహుల లిస్టు ఉందని, ఎవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలోననే అంశంపై ఆయన అన్ని కోణాల్లో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారని ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి స్థాయినా.. పాక్షికమా?

లోకల్ బాడీ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? విస్తరణ వల్ల కొత్త సమస్యలు వస్తాయా? పదవులు రాని ఎమ్మెల్యేలు ఎన్నికలకు సహకరిస్తారా? అనే అనుమానాలు పార్టీలో ఉన్నాయి. ఒకవేళ విస్తరణ చేపడితే ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేస్తారా? లేకపోతే ఇద్దరు, ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకుని మిగతావి పెండింగ్‌లో పెడతారా? అనే చర్చ జరుగుతున్నది. కానీ, ఆశావహులు మాత్రం కేబినెట్‌లో బెర్త్ కోసం 14 నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఇదే తమకు చివరి అవకాశమని, ఎలాగైనా తమకు మంత్రి పదవి ఇవ్వాలని, తర్వాత తాము రాజకీయాల నుంచి రిటైర్ అవుతామని అధిష్టానాన్ని ప్రాధేయపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమ జిల్లాలకు కేబినెట్‌లో ప్రాధాన్యత లేదని, ఎంత కాలం మా జిల్లాల పట్ల వివక్ష చూపుతారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలైతే తాము పార్టీలోకి రావడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తమకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని కామెంట్స్ చేస్తున్నట్లు తెలిసింది.

Next Story