అధికారాన్ని అడ్డం పెట్టుకొని ‘వ్యాపారాలు’.. సీఎం చేతిలో ఐఏఎస్‌ల అవినీతి చిట్టా!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-03 01:35:29  IST  )

తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారుల చిట్టా సీఎం రేవంత్ రెడ్డికి చేరగా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ‘వ్యాపారాలు’.. సీఎం చేతిలో ఐఏఎస్‌ల అవినీతి చిట్టా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్, బిల్డర్స్, అక్రమ ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా సీఎం చేతికి చేరినట్లు తెలిసింది. దీంతో నేడు సెక్రెటేరియట్‌లో జరిగే కాన్ఫరెన్స్‌లో అలాంటి అధికారులకు సీఎం క్లాస్ తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశమున్నట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

నిఘా వర్గాల రిపోర్ట్

నేడు సెక్రెటేరియట్‌లోని 8వ అంతస్తులో కలెక్టర్లు, సెక్రెటరీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, కొందరు బ్యూరోక్రట్స్ పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో.. వారిపై నిఘా వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అందులో కొందరు ఐఏఎస్‌లు క్షేత్ర స్థాయిలో తమ అధికారాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్, బిల్డర్స్‌తో కుమ్మక్కై వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇసుక అక్రమాలకు పాల్పడే ముఠాలతో చేతులు కలిపి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు ఆఫీసర్లు తమ టేబుల్ వద్దకు వచ్చే ప్రతి ఫైల్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను గుర్తించి ఇప్పటికే కొందరిని అక్కడి నుంచి బదిలీ చేశారు. మరికొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి కొంత గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

పనితీరుపై నివేదిక

కలెక్టర్లు, సెక్రెటరీల పనితీరుపై సీఎస్ రామకృష్ణారావు విడివిడిగా నివేదికలు రెడీ చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్టు తెలిసింది. ఆ నివేదికల ఆధారంగా సీఎం వారికి కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన సెక్రెటరీ, కలెక్టర్ల మీటింగ్‌లో.. ప్రతి అధికారి వారంలో ఒకసారైనా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు గురుకులాలకు వెళ్లి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఫీల్డ్ మొహం చూడని కలెక్టర్లు/సెక్రెటరీల జాబితా చాలా పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకరిద్దరు సీనియర్ సెక్రెటరీలు మినహా మిగతా అధికారులు ఎవరూ ఫీల్డ్‌కు వెళ్లలేదని విమర్శలు ఉన్నాయి. అలాగే, కలెక్టర్లు సైతం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లేందుకు సుముఖంగా లేరనే చర్చ జరుగుతున్నది. అలాంటి ఆఫీసర్లకు సీఎం క్లాస్ తీసుకునే అవకాశం ఉంది.

అవినీతి ఆఫీసర్లపై చర్యలు ఇలా..

–పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌పై ఫిర్యాదులు రావడంతో.. ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. దీంతో స్థానికులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

– ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన కలెక్టర్ ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయన్ను దక్షిణ తెలంగాణకు చెందిన ఓ చిన్న జిల్లాకు బదిలీ చేశారు.

– హెల్త్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్న ఓ అధికారి డబ్బులు ఇచ్చిన తరువాతే పనులు చేస్తానని కండీషన్ పెడుతున్నట్టు తెలియడంతో.. ఆయన్ను దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్‌గా నియమించారు.

– ఓ కీలకమైన శాఖలో స్పెషల్ సెక్రెటరీగా పని చేస్తున్న ఓ ఐఏఎస్.. పైసలు చేతికి అందిన తర్వాతే ఫైల్ క్లియర్ చేసేందుకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సిద్ధమైతే.. ఓ సీనియర్ నేత అడ్డుపడ్డారని ప్రచారం జరుగుతున్నది.

– ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సరిగా పనిచేయట్లేదని, అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన్ను ఏడాది క్రితం అంతగా ప్రయారిటీ లేని శాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ శాఖలో కూడా ఫైల్‌పై సంతకం పెట్టేందుకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆయన్ను ఏ శాఖకు బదిలీ చేయాలో ప్రభుత్వ పెద్దలకు అర్థం కావట్లేదని టాక్.

Next Story