బిన్స్ లేకుంటే బిజినెస్ బంద్.. వ్యాపార సంస్థలపై సీఎంసీ కఠిన నిర్ణయం

by Ramesh Naini |

‘వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలి. లేకుంటే బిజినెస్ బంద్ చేస్తాం. ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం. ఆయా సంస్థ పరిసరాల్లో సైతం వాళ్లే పారిశుధ్య నిర్వహణ చూసుకోవాలి. మున్సిపల్ కార్మికులు ఊడ్వరు.’ అని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.సృజన స్పష్టం చేశారు.

బిన్స్ లేకుంటే బిజినెస్ బంద్.. వ్యాపార సంస్థలపై సీఎంసీ కఠిన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ శేరిలింగంపల్లి: ‘వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలి. లేకుంటే బిజినెస్ బంద్ చేస్తాం. ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం. ఆయా సంస్థ పరిసరాల్లో సైతం వాళ్లే పారిశుధ్య నిర్వహణ చూసుకోవాలి. మున్సిపల్ కార్మికులు ఊడ్వరు.’ అని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ (సీఎంసీ) జి.సృజన స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని న్యాక్ బిల్డింగ్స్‌లో శనివారం మీడియాతో ఆమె చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని చెప్పారు. వాణిజ్య సంస్థలకు బిన్ ఏర్పాటు చేయాలని ముందుగా చెబుతామని, ఆ తర్వాతనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎంసీలోని 16 సర్కిళ్లను ఒక్కోదాన్ని మూడు సార్లు విజిట్ చేశామని, ఇక నుంచి ప్రతి వార్డును తనిఖీ చేయడంతో పాటు కొత్త సమస్యలను గుర్తించడం, గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎంసీలోని ప్రతి విభాగానికి సిస్టం ఆఫ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) రూపొందించామని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్, ప్రజలకు అందించాల్సిన సేవలు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, స్పోర్ట్స్, రెవెన్యూ, శానిటేషన్, ఎంటమాలజీ వంటి కార్యక్రమాలను చేపట్టడానికి వ్యవస్థాగతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

హైటెక్ సిటీ సమీపంలోనే..

సీఎంసీ హెడ్ ఆఫీస్ భవనాన్ని హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసరాల్లో నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కైతలాపూర్‌లో రెండు హౌసింగ్ బోర్డు భూములను పరిశీలించామని కోర్టు కేసుల కారణంగా వేరే ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీ ఏరియాల్లోనే స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు.

24 గంటల్లో ఫోన్ వెళ్లాల్సిందే..

పౌర ఫిర్యాదులపై ఫోకస్ పెట్టామని, ఎక్స్, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్, ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 24 గంటల్లో సిటిజన్‌కు ఆఫీసర్ కాల్ చేయాల్సిందేనని, 48 గంటల్లో ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతోపాటు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ప్రజావాణి నాటికి ఆ ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని, పరిష్కారం కాకపోతే ఎందుకు పెండింగ్‌లో పెట్టారో రశీదులో పొందుపర్చాలని అధికారులకు ఆదేశాలిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సీఎంసీ, మున్సిపాలిటీకి చాలా తేడా ఉంటుందని, జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత ఇక్కడ పద్ధతులకు అలవాటు పడటానికి సమయం పడుతుందని, వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు.

క్యాపిటల్ వ్యాల్యూనే బెటర్

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో రెండు రకాల విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వ్యాల్యూ, విలీన మున్సిపాలిటీల్లో క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నామని, ఇది సరైనది కాదని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే రెంటల్ వ్యాల్యూ కంటే క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ఉంటేనే బెటరని చెప్పారు. రెంటల్ వ్యాల్యూ ఆధారంగా అయితే పేదలకు అన్యాయం జరుగుతుందని, క్యాపిటల్ వ్యాల్యూ అయితే శాస్త్రీయబద్ధంగా ఉంటుందన్నారు.

ఫండ్స్ కొరత లేదు

పెండింగ్ బిల్స్ రూ.150 కోట్లు, ఒక జోన్‌లో రూ.110 కోట్లు, మరో జోన్‌లో రూ.80 కోట్లు, ఇంకో జోన్‌లో రూ.90 కోట్లు మొత్తం రూ.430 కోట్లు అవసరముందన్నారు. రోజువారీ కార్యక్రమాల కోసమైతే ఫండ్స్ కొరత లేదన్నారు. హెచ్-సిటీ ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లు అవసరముందని, నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పారు. దీంతోపాటు ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు.

క్యూర్ పరిధిలో ఒకే విధానం

కొత్త అడ్వర్‌టైజ్‌మెంట్ పాలసీ అమలు, సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ, స్ట్రీట్ లైట్ల నిర్వహణ అంశాలను క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కామన్ విధానం ఉంటుందని తెలిపారు. మూడింటికి కామన్ టెండర్ డాక్యుమెంట్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అడ్వర్‌టైజ్‌మెంట్‌కు సంబంధించిన అన్ని రకాల డేటా సేకరించామని చెప్పారు. వీటిలో ఆర్ అండ్ బీ, నేషనల్ హై, రైల్వే శాఖలు 2030 వరకు లీజు ఇచ్చిన పరిస్థితి ఉందని, వీటిని ఎలా పర్యవేక్షించాలనేదానిపై న్యాయనిపుణులు సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు.

సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి లేఖ

మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో సిబ్బంది కొరత ఉందని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇద్దరు ఏసీపీలు సీఎంసీతోపాటు వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి వాళ్లతో క్వాలిటీ వర్క్ తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. డీటీసీపీ, పబ్లిక్ విభాగం, సీడీఎంఏ, పంచాయతీరాజ్ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై పంపించాలని కోరినట్టు చెప్పారు.

Next Story