- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట అవశేషాలు కాల్చితే లాభం కంటే నష్టమే ఎక్కువ : వ్యవసాయ శాఖ
రైతులు పంట అవశేషాలను కాల్చడం ద్వారా లాభాల కంటే అధిక నష్టాలు కలుగుతున్నాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్గోపీ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు పంట అవశేషాలను కాల్చడం ద్వారా లాభాల కంటే అధిక నష్టాలు కలుగుతున్నాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్గోపీ తెలిపారు. పంట వ్యర్థాల దహనం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం పదార్థం దెబ్బతినడంతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా నశిస్తాయి. దీని ప్రభావంతో భూసారం తగ్గి, భవిష్యత్‌లో రసాయన ఎరువులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పంట వ్యర్థాల దహనంతో గాలి కాలుష్యం పెరగడం, ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంది. వేసవి కాలంలో మంటలు వేగంగా వ్యాపించి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూములపై, చెత్త మైదానాల్లో కానీ ఇతర ప్రదేశాలలో వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిహార రుసుము విధించబడుతుందన్నారు. సాధారణంగా చెత్తను కాల్చినట్లయితే రూ.5 వేలు, భారీ స్థాయిలో వ్యర్థాలను కాల్చినట్లయితే రూ.25 వేలు పర్యావరణ పరిహారం చెల్లించాల్సి వస్తోందన్నారు.
ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై చెత్తను బహిరంగంగా కాల్చకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం ద్వారా భూసారం మెరుగుపడటంతో పాటు సేంద్రీయ కార్బన్ పెరుగుతుంది. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది రైతులు ఇప్పటికీ పంట వ్యర్థాలను కాల్చివేస్తున్నారని తెలిపారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతులు చాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మలు పంట వ్యర్థాలు కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన తీవ్ర విచారం కలిగించిందని తెలిపారు.ఈ ఘటనలతో సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా శాస్త్రీయ పద్ధతులను అనుసరించి భూముల సారాన్ని కాపాడుకోవాలని కోరారు.






