తెలంగాణకు బుల్లెట్ ట్రైన్..! ప్రధాని మోడీ వద్ద సీఎం రేవంత్ ప్రతిపాదన

by Kema Shiva Kumar |

తెలంగాణకు బుల్లెట్​ రైలు ​తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్..! ప్రధాని మోడీ వద్ద సీఎం రేవంత్ ప్రతిపాదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు బుల్లెట్​ రైలు ​తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణ భారతంలోని ప్రముఖ పట్టణాలను కలుపుతూ ఈ బుల్లెట్​రైలు రూట్ మ్యాప్ ఉండేలా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తున్నది. సౌత్ ఇండియాలోని ప్రముఖ మెట్రోపాలిటిన్​సిటీలుగా గుర్తింపు పొందిన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం ఉండే విధంగా ప్రతిపాదించినట్టు సమాచారం. దేశంలో ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్​ వరకు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి. మరే ప్రాంతంలోనూ ఈ రైలు సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాంత మెట్రోపాలిటిన్ సిటీలను కలుపుతూ బుల్లెట్​ట్రైన్​ఉండాలని సీఎం ప్రతిపాదన చేసినట్లు తెలుస్తున్నది.

ప్రజా రవాణా మెరుగుపర్చేందుకు..

దేశంలో పెరుగుతున్న జనాభా, తక్కువ రవాణా సదుపాయాలు ఉన్న దృష్ట్యా దేశప్రజల అవసరాలను తీర్చే విధంగా బుల్లెట్ రైలును ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించారు. దీనిలో భాగంగా మొదట ముంబై నుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ​ట్రైన్​ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదికి సైతం బుల్లెట్ ట్రైన్ ​ఉండాలని సీఎం రేవంత్​ఆలోచిస్తున్నారు. బుల్లెట్ ​ట్రైన్​ వేగం రీత్యా దానికి ప్రత్యేకంగా రైల్వే లైన్ వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నయ్ నుంచి ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి వరకు, అమరావతి నుంచి హైదరాబాద్​ఫోర్త్​సిటీ వరకు, ఫోర్త్‌ సిటీ నుంచి బెంగళూరు వరకు బుల్లెట్​ట్రైన్​ఉండాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. దేశంలో ఆర్థికంగా బలమైన నగరాల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్ ముందు వరుసలో ఉంటాయి. ఈ నగరాలు రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తాయని, ఇక్కడి ప్రజల రవాణా అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలంటే బుల్లెట్​ట్రైన్ సైతం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

బుల్లెట్ ట్రైన్ చాలా అవసరం..

దక్షిణాది నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్​పనులు పూర్తయ్యే నాటికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోడ్డు, వాయు మార్గాలే ప్రజల అవసరాలను తీర్చలేవని, బుల్లెట్ ట్రైన్ లాంటివి అవసరమని చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, బల్క్​డ్రగ్‌లో.. హైదరాబాద్, బెంగళూరు నగరాలు, ఎగుమతులు, తయారీ రంగానికి చెన్నయ్ సిటీ పేరుగాంచాయి. ఈ మూడూ చారిత్రాత్మక నగరాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో ఈ మోడ్రన్ నగరాలకు బుల్లెట్​ట్రైన్​ఎంతో ముఖ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బుల్లెట్​ట్రైన్​వేయాలంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో విదేశీ రుణ సాయాన్ని కేంద్రం తీసుకొని పనులు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విదేశీ రుణ సాయంపై కేంద్రం సైతం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇతర దేశాల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవడం కేంద్రానికి సులువు అవుతుందని అంచనా. దీనికి తోడు కేంద్రం వెచ్చించే నిధులకు రాష్ట్రాలు కొంత మొత్తం వెచ్చిస్తే సరిపోతుంది. బుల్లెట్​ట్రైన్ సదుపాయం కలిగితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడుతాయని, రవాణా సదుపాయం సులువు అవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నగరాల మధ్య దూరం...

చెన్నయ్ నుంచి అమరావతి వరకు 450 కిలో మీటర్లు..

అమరావతి నుంచి ఫోర్త్​సిటీ వరకు 300 కిలో మీటర్లు

ఫోర్త్ సిటీ నుంచి బెంగళూరు వరకు 560 కిలో మీటర్లు

ఫోర్త్​సిటీ నుంచి ముంబై వరకు 700 కిలో మీటర్లు

Next Story