- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరేపల్లిలో పైపై పనులు.. నెలకే పగిలిన బీటీ రోడ్డు!
పల్లె ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసి

దిశ, కారేపల్లి: పల్లె ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం చేస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వైఖరి కారణంగా రోడ్లు నిర్మించిన నెల రోజులోపే మట్టి కంకర తేలుతూ దర్శనమిస్తున్నాయి. పల్లెల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఏ ఒక్కపనిలో కూడా నాణ్యత లేకపోగా మంజూరైన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకుండా, తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి అధికారులు పర్సంజీల రూపంలో ముడుపులు పుచ్చుకుంటూ నాణ్యత విషయాన్ని గాలికి వదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు వేసిన నెల రోజులలోపే గుంతలు ఏర్పడి, కంకర తేలడంతో అవినీతి ఏ మేరకు రాజ్యమేలుతుందనేది స్పష్టమవుతుంది. నెల గడవకముందే రోడ్డు దెబ్బతినడాన్ని చూస్తుంటే ఆర్‌అండ్‌బీ శాఖ నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. కారేపల్లి మండలంలో వేసిన బీటీ రోడ్ నిర్మాణ పనులు అధికారులు, కాంట్రాక్టర్ల చేతివాటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కారేపల్లి మండల కేంద్రం నుంచి పేరేపల్లి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల నుంచి 6కోట్లు నిధులను మంజూరు చేసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం ఆసరాగా చేసుకొని కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బీటీ రోడ్డును నిర్మించారు. తులిసియా తండా, రావొజి తండా, పేరేపల్లి గ్రామల సమీపంలో రోడ్డు వేసిన నెల రోజులు గడవకముందే రోడ్డుపై వేసిన బిటీ మొత్తం తేలిపోయి గుంతలు ఏర్పడి, కంకర, మట్టి రోడ్డుపై కనపడుతున్నాయి. రోడ్లు నిర్మించి నెల రోజులు కాకా ముందే రోడ్డుపై గుంతలు ఏర్పడి, కంకర మట్టి తేలడంతో గ్రామస్తులు నాణ్యత పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నాణ్యతకు నీళ్లు..
కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలి ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు పనులను ప్రారంభించిన తర్వాత గ్రావెల్ వేయాల్సిన సమయంలో సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేయలేదని విమర్శలు వస్తున్నాయి. నాణ్యత కలిగిన గ్రావెల్స్ వాడాల్సి ఉండగా అవేవీ లేకుండా పక్కన ఉన్న మట్టిన్ని పోసి రోలింగ్ చేశారు. దానిపై కంకర వేసి సన్నని కంకర చిప్స్ కంకరని పోశారు. కంకర పోసిన అనంతరం వాటర్ క్యూరింగ్ చేసి రోడ్ రోలర్‌తో తొక్కించాల్సి ఉండగా నామమాత్రంగా రోడ్డు పై రోలార్ తో తొక్కించి పనులను చేపట్టారు. నాసిరకం కంకరని వినియోగించారు. బీటీ రోడ్డు నిర్మాణం చేసే సమయంలో రోడ్లకు షోల్డర్స్ మట్టి పోసి కంకర వేసి రోలింగ్ చేసిన తర్వాత శుభ్రంగా చేసి డాంబర్ చల్లి బిటీ రోడ్డును వేయాల్సి ఉండగా ఇవేమీ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా రోడ్లను నిర్మించడంతో కొద్ది రోజులకే రోడ్డుపై కంకర మట్టి తేలాయి. దీంతో రోడ్డుపై సిమెంట్ కల్పిన డస్ట్, చిప్స్‌తో పూడ్చి సదరు కాంట్రాక్టు, అధికారులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రాబోయే వర్ష కాలంలో భారీ మొత్తంలో వర్షాలు కురిస్తే రోడ్డు పరిస్థితి ఎందని స్థానికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నాణ్యతలేని రోడ్డు వేసిన కాంట్రాక్టుపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నంత స్థాయి అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
నాణ్యత ఉంటేనే రికార్డు చేస్తాం : ప్రవీణ్, రోడ్డు, భవనాల ఏఈ
కారేపల్లి నుంచి పేరేపల్లి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరీక్షించాకే రికార్డు చేసి బిల్లులు చెల్లిస్తాం. నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే రికార్డు చేయం, బిల్లులు చెల్లించం.






