కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌.. కేంద్రమంత్రికు కేటీఆర్ లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-01 15:02:23  IST  )

రాష్ట్రంలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ..

కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌.. కేంద్రమంత్రికు కేటీఆర్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర మంత్రికి అందజేసింది. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబాద్ డివిజన్‌పై పనిభారం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉన్నదని.. రాబోయే కాలంలో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తయితే, ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని వివరించారు. విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా.. గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉన్నదని గుర్తుచేశారు. ఈ భారీ అసమతుల్యతతో సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ అత్యంత సంక్లిష్టంగా మారిందని, ఇది రైళ్ల రాకపోకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తే అటు పరిపాలన సౌలభ్యం, ఇటు కార్యకలాపాల రీత్యా సేవలు మెరుగుపడుతాయని స్పష్టం చేశారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మనుగూరు అండ్ సత్తుపల్లి వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని సూచించారు. అలాగే.. పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళిక సామీప్యత దృష్ట్యా దానిని కాజీపేట డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే, లాతూర్ రోడ్-పర్లీ వైజనాథ్ సెక్షన్‌ను నాందేడ్ డివిజన్‌కు మార్చే అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని విన్నవించారు.

Next Story