- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీకటి ఒప్పందాలతో తెలంగాణ గొంతు కోశారు : బడ్జెట్ పై కేటీఆర్ ఫైర్
కేంద్ర బడ్జెట్ 2026-27లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ 2026-27లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపించిందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కేంద్రంతో చీకటి ఒప్పందాలు చేసుకుని, రాష్ట్రం గొంతుకోసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు.. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు మూకుమ్మడిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది గుండుసున్నా - మిగిలింది మొండిచెయ్యి మాత్రమేనని ఆరోపించారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఆరు చిల్లరపైసలు కూడా తేలేని చేతకాని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ దౌర్భాగ్యమన్నారు. బడాభాయ్ తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన ఛోటాభాయ్ మాటలన్నీ బూటకమేనని కేంద్ర బడ్జెట్ సాక్షిగా తేలిపోయిందన్నారు. రేవంత్ చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మోసేందుకు, బీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న ముఖ్యమంత్రి స్కాములపై విచారణ జరపకుండా కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునేందుకేనని మరోసారి రుజువైందని పేర్కొన్నారు.
రాష్ట్రం నుంచి పేరుకు ఇద్దరు కేంద్రమంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీసం గొంతెత్తి అడగకపోవడం వల్లే తెలంగాణకు చిల్లి గవ్వ కూడా కేంద్ర బడ్జెట్ లో దక్కలేదని కేటీఆర్ వాపోయారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తోపాటు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన చెరో ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నట్టు ? మీ సొంత పైరవీల కోసమా మిమల్ని తెలంగాణ ప్రజలు గెలిపించి ఢిల్లీకి పంపించింది ?? అని ప్రశ్నించారు. స్వీయ రాజకీయ అస్థిత్వమైన బీఆర్ఎస్ కు లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడంవల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందని ఎక్స్ పోస్టులో తెలిపారు.






