BREAKING: జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-05 11:13:24  IST  )

బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రగతి నివేదికను విడుదల చేశారు.

BREAKING: జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రగతి నివేదికను విడుదల చేశారు. తెలంగాణ భవన్ లో నివేదికను విడుదల చేసిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్ చేశారు. బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్ టైమ్, ప్లేస్ చెప్తే ఎక్కడికైనా వస్తామని ఛాలెంజ్ చేశారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ రూమ్, గాంధీ భవన్.. ప్లేస్ ఏదైనా సరే రావడానికి రెడీగా ఉన్నామన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా.. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని గౌరవిస్తానన్నారు. వారి భాషలోనే సమాధానం చెప్పడం తమకూ వచ్చని, కానీ ఆ పద్ధతి సరికాదని కేసీఆర్ చెప్పారన్నారు.

ఫార్ములా e రేసుపై మరో ఛాలెంజ్

తనపై ఉన్న ఫార్ములా e రేసు కేసుపై కేటీఆర్ మరో సవాల్ చేశారు. తనపై, రేవంత్ పై కూడా ఏసీబీ కేసులున్నాయన్న ఆయన.. ఎవరు నిజాయితీ పరులో లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే తేలుతుందన్నారు. తాను లై డిటెక్టర్ టెస్టుకి రెడీగా ఉన్నానని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించా ఈ టెస్టుకు రావాలన్నారు. ఎవరు నిజాయితీ పరుడో, ఎవరు దొంగో ప్రజలు కూడా చూస్తారన్నారు.

జూబ్లీహిల్స్ కోసం రూ.5328 కోట్ల ఖర్చు

బీఆర్ఎస్ హయాంలో ప్రజారోగ్యం కోసం జూబ్లీహిల్స్ లో రూ.919 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఒక్క జూబ్లీహిల్స్ లోనే 13 దవాఖానాలు పెట్టామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రూ.324 కోట్లు ఖర్చు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.17.3 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, ఇతర నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ. 18 కోట్లు, వీధుల్లో ఎల్ఈడీ లైట్లకు రూ.5 కోట్లు, సీసీ కెమెరాల కోసం రూ.2.7 కోట్లను ఖర్చు చేశామని కేటీఆర్ వివరించారు.

అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా మార్చామన్నారు. హైదరాబాద్ ను కేసీఆర్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఐలాండ్ గా తీర్చిదిద్దిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాలో భాగంగా జూబ్లీహిల్స్ లో రూ.455 కోట్ల వ్యయంతో 10 సబ్ స్టేషన్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, సెలూన్లకు, లాండ్రీ షాపులు, దళితులు, గిరిజనులకు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు రూ.50 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. అలాగే రూ.180 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు అందించామన్నారు. వీటిలో 15 వేల ఉచిత నల్లా కనెక్షన్లకు రూ.30 కోట్లు, బోరబండ వాటర్ రిజర్వాయర్ కు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రూ.75 కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. ఎస్ఎన్డీపీ, ఇతరత్రా పనులకు ఈ నిధులను ఖర్చు చేసినట్లు తెలిపారు. కానీ.. ఆ పనులు ప్రారంభించేలోగానే ప్రభుత్వం మారిందన్నారు. పార్కుల సుందరీకరణకు రూ.20 కోట్లు, విపత్తు నిర్వహణ పనులకు రూ.4.45 కోట్లు, గులకపూర్ కాల్వ, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. పదేళ్లలో జూబ్లీహిల్స్ రోడ్ల పనుల కోసం బీఆర్ఎస్ సర్కార్ రూ.2463 కోట్ల నిధులను ఖర్చు చేసిందని ప్రగతి నివేదికలో వెల్లడించారు. మొత్తంగా నియోజకవర్గంలో ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం రూ.5328 కోట్ల నిధులను ఖర్చు చేశామని కేటీఆర్ తెలిపారు.

READ MORE ....

BRSను కేసీఆర్‌ BJPకి తాకట్టు పెట్టిండు.. సీఎం రేవంత్‌ హాట్ కామెంట్స్

Next Story