పవర్ కట్స్‌పై BRS Vs కాంగ్రెస్.. హస్తం పార్టీ కౌంటర్ ఇదే..!

by Disha Web Desk 4 |
పవర్ కట్స్‌పై BRS Vs కాంగ్రెస్.. హస్తం పార్టీ కౌంటర్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ విషయంలో హైవోల్టేజ్ రాజకీయాలు జోరందుకున్నాయి. విద్యుత్ విషయంలో కేసీఆర్ సర్కార్ అంతా పైన పటారం లోన లొటారం అన్న చందంగా వ్యవహరించిందని విద్యుత్ సంస్థల సంక్షోభాన్ని దాచిపెట్టి గొప్పలకు పోయిందని రేవంత్ రెడ్డి సర్కార్ ధ్వజమెత్తింది. ఈ మేరకు విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసి బీఆర్ఎస్ పాలన నిర్వాకాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య కరెంట్‌పై పవర్ ఫుల్ డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నగరంలో పవర్ కట్స్‌పై అధికారులు చేసిన ప్రకటన మరోసారి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

గులాబీ నేతలకు కాంగ్రెస్ కౌంటర్

రాబోయే సమ్మర్ డిమాండ్ ను ఎదుర్కొనేందుకు టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సబ్ స్టేషన్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 15 నిమిషాల నుంచి 2 గంటల పాటు నిర్వహణ పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను విడుదల చేశారు.

దీంతో ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ వస్తే పవర్ కట్ ఉంటుందని గతంలోనే కేసీఆర్ చెప్పారని బీఆర్ఎస్ మద్దతుదారులు వ్యాఖ్యలు చేస్తుంటే ఈ కామెంట్స్‌కు కాంగ్రెస్ మద్దతుదారులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అధికారులు విడుదల చేసిన షెడ్యూల్‌లో స్పష్టంగా విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేందుకే ఏరియాల వారీగా పవర్ కట్ చేస్తున్నట్లు పేర్కొన్నారని అయినా బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.


Next Story

Most Viewed