BRS: ఆగ‌స్టు 8న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ.. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

by Ramesh Naini |

ఆగస్టు 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

BRS: ఆగ‌స్టు 8న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ.. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆగస్టు 8వ తేదీన బీసీ సంఘాలతో కలిసి కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల‌ అమలుపై మంగళవారం తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బీసీ నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో కాంగ్రెస్ మభ్య పెడుతోందని ఆరోపించారు. చివరికి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. బీసీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా పాస్ చేసి పంపారని, ఆ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారని అన్నారు. ఆర్డినెన్స్‌తో ఏదో జరిగినట్లు సంబురాలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో 5,6,7 తేదీల్లో డ్రామాలు ఆడుతున్నారని, చివరిగా కేంద్రంపై నెపం పెట్టబోతున్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నది మా డిమాండ్ అని స్పష్టం చేశారు. వచ్చే నెల 8 న కరీంనగర్‌లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలని సభ ద్వారా డిమాండ్ చేయబోతున్నామని స్పష్టం చేశారు. మేము బీఆర్ఎస్ తరపున ఢిల్లీలో రాష్ట్రపతిని బీసీ రిజర్వేషన్లపై కలుస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, బీసీలకు రక్షణ కవచంగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.

Next Story