- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెవిలో పువ్వు పెట్టుకొని.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. అధికారం చేపట్టి 420 రోజులు అయినా.. 420 హామీలను నెరవేర్చకపోవడంపై గులాబీ నేతలు భగ్గుమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాల వద్ద నిరసనలకు దిగారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బుద్ధి ప్రసాదించు మహాత్మా..’ అంటూ వినతిపత్రాలు అందించారు. ఇప్పటికే ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు నేతలు నిరసనలు చేపట్టారు.
ఎక్కడికక్కడ నిరసనలు
గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చెవిలో పువ్వు పెట్టుకొని.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసి భర్తీ చేయడం మరిచిపోయారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ప్రజల పక్షాల నిలబడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడుతామన్నారు. మేడ్చల్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్వాన్ నియోజకవర్గం లంగర్‌హౌస్ డివిజన్ పరిధిలో మహాత్మాగాంధీ విగ్రహానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొని వినతిపత్రం ఇచ్చారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మండల కమిటీలు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు.






