కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించేది గులాబీ దండే.. కవిత హాట్ కామెంట్

by Bhoopathi Nagaiah |

బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించేది గులాబీ దండే.. కవిత హాట్ కామెంట్
X

దిశ, భద్రాచలం : బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఉద్యమకారులను, కార్యకర్తలను కలిసేందుకు భద్రాచలం వచ్చిన కవిత ముందుగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణా రాష్ట్ర ఉద్యమకారులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఉద్యమ కారులది, బీఆర్ఎస్ పార్టీది రక్త సంబంధం అన్నారు. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేదే కాదన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదరించకపోయినా కేసీఆర్ జిల్లాలో3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. 70 లక్షల సభ్యత్వాలు ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అని, ప్రతి కార్యకర్త తలెత్తుకుని జీవించేలా పార్టీ చేస్తుందని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే ధ్యేయంతో మనమందరం కష్టపడాలని పిలుపునిచ్చారు.

మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. గోడు వెళ్లబోసుకున్న ఉద్యమకారులు

పార్టీలోకి వలస వచ్చిన నాయకులు వారికి ఇష్టం వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ, ఉద్యమ కారులను పట్టించుకోవడం లేదని ఉద్యమకారులు ఎమ్మెల్సీ కవిత ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ల అనుచరులకు పదవులు కట్టబెట్టడం వల్లనే పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరావు, రేగా కాంతారావు, హరిప్రియా, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు పాల్గొన్నారు.

Next Story