MLC Kavitha: నా మీద కుట్రలు.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటపెడతా.. మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-12 05:53:47  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha: నా మీద కుట్రలు.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటపెడతా.. మరోసారి కవిత  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తీరు సంచలనంగా మారుతోంది. త్వరలో ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకున్న వేళ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు.

రెచ్చగొట్టకండి..

నేను ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా... ఇంకా నన్ను కష్టపెడతారా? అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాననని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణం అయ్యాయి. ఈ రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. దీంతో కవిత తీరు సొంత పార్టీ పరిపాలన, అందులోను తండ్రి సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చెప్పేలా ఉందని కవిత వైఖరి చూస్తే బీఆర్ఎస్ ను (BRS) వీడి సొంత పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కవిత తాజాగా పై విధంగా స్పందించారు.

ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్?:

తాజాగా చిట్ చాట్ లో కవిత మాట్లాడుతూ తనను రెచ్చగొట్టవద్దని, అలా చేస్తే తాను మరింత గట్టిగా స్పందిస్తానని చెప్పడం వెనుక బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. నిజానికి గత కొంత కాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం గుప్పుమంటోంది. కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, గత నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందే అవి మరింత తీవ్రతరం కావడంతో వీరి మధ్య అంతర్గత పోరు మొదలైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఇబ్బంది పడేలా కవిత వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తనను రెచ్చగొట్టవద్దని కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది సస్పెన్స్ గా మారింది. ఈ పరిణామాలతో 'బీఆర్ఎస్ మే యే క్యా హో రహా హై?' అనే గుసగుసలు కారు పార్టీలో జోరందుకుంటున్నాయి.

Next Story