Kaushik Reddy: రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం

by Gantepaka Srikanth |

మేడారం జాతర వేళ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Kaushik Reddy: రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం జాతర వేళ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy) వివరణ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరీంనగర్ పోలీస్ కమిషనర్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని నేను అనలేదు. ఆ మాటలు నేను అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధం. నన్ను వేధించాలనే తప్పుడు కేసు పెట్టి సీఐడీతో విచారణ చేస్తున్నారు. మినీ మేడారం జాతరకు 50 మందితో వెళ్లానని పోలీసులు చెబుతున్నారు. 50 మందితో వెళ్లినట్లు నిరూపిస్తే క్షణం ఆలోచించకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కావాలనే నన్ను టార్గెట్ చేశారు. ఎవరినీ వదలను. మా ప్రభుత్వం వచ్చాక అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా. పోలీసు ఉన్నతాధికారులు వారికి వారే చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు’ అని పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఇప్పటికే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఈ వ్యవహారంపై కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ‘ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని గతంలోనే అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి సారీ చెప్పిన విషయం తెలిసిందే.

Next Story