BRS MLA: అమ్ముడుపోయావని ఆయన్ని ప్రశ్నిస్తే తప్పేంటి?

by Dudam.Markandeya |   (  Updated:2025-12-19 03:32:07  IST  )

పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కాదని సీఎం సభలో చెబుతున్నారని.. సుప్రీం కోర్టును అవహేళన చేస్తూ సభలో మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పేర్కొన్నారు.

BRS MLA: అమ్ముడుపోయావని ఆయన్ని ప్రశ్నిస్తే తప్పేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కాదని సీఎం సభలో చెబుతున్నారని.. సుప్రీం కోర్టును అవహేళన చేస్తూ సభలో మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాగీరు కాదని.. కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. సుప్రీం కోర్టుపై తమకు నమ్మకం ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్నారు. అలాగే.. శాంతి భద్రతలపై ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వలేదని, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇంటి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీతోపాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేను హత్య చేసేందుకు పోలీసులు గుండాలను ఎస్కార్ట్ వాహనంలో తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇప్పటివరకు ఎమ్మెల్యే గాంధీపై చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పోలీసు ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా అని ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్ళితే.. ఉల్టా తనపైనే కేసు పెట్టారని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తనను కరీంనగర్ మీటింగ్‌లో తోసివేశారని, కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయావని సంజయ్‌ని ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి పార్టీ మారిన వారిని ప్రశ్నిస్తామని అన్నారు. శాసన సభలో తమ గొంతు నొక్కినా.. బయట వేలాది ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల బిల్లులు తక్షణమే ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని చెప్పారు. ఇప్పటికైనా ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఏడుపు ఇకనైనా బంద్ చేయాలని సూచించారు.

Next Story