మా మనసు గాయపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.. సర్కార్‌కు బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ బీసీలపై విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నదని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి విమర్శించారు.

మా మనసు గాయపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.. సర్కార్‌కు బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బీసీలపై విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నదని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నా వాటిని నీరుగారిస్తున్నదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయ్యకుండా మోసం చేస్తున్నదన్నారు. బీసీ బిల్లు పెట్టాక సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి అనేక సార్లు పోయినా దీనిపై మాట్లాడలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీసీల మనసు గాయపడితే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వి..శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 42శాతం జీవో ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని, ఈ 22 నెలల్లో జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి తేల్చుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధించే వరకు ఢిల్లీ వదిలేది లేదని పోరాడాలని సూచించారు. మాట తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Next Story